దిశ దశ, ఖమ్మం:
తెలంగాణలో తుపాను ప్రభావ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సహాయ మంత్రి బండి సంజయ్ వివరించారు. శనివారం అర్థరాత్రి నుండి కురుస్తున్న వరదల వల్ల రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జిల్లాలోని 110 గ్రామాలు నీట మునిగి పోయాయని, పట్టణంలోని ప్రకాష్ నగర్ కొండలో 9 మంది గల్లంతయ్యారని వివరించారు. పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరా తండా కొండపై 68 మంది చిక్కుకున్నారని, 42 మంది భవనాలపై చిక్కుకున్నారని హోంమంత్రికి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. తెలంగాణాలో ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అమిత్ షా ఆదేశించారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా 9 NDRF బృందాలను పంపిస్తున్నట్టు వెల్లడించారు. విశాఖపట్నం, అస్సాం, చెన్నైల నుండి మూడు NDRF బృందాలను పంపించాలని హోమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ NDRF విభాగానికి చెందిన ఉన్నతాధికారులతో మాట్లాడారు. రాష్ట్ర అధికార యంత్రాంగంతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టాలని వారికి సూచించారు.