రేషన్ డీలర్లకు ఖుషీ కబర్…

కమీషన్ పెంచిన సర్కార్…

వారసులకు షాపులు

దిశ దశ, హైదరాబాద్:

డిమాండ్లను పరిష్కరించాలని రేషనల్ డీలర్లు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో వారికి న్యాయం చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ఇచ్చిన హామీ మేరకు చర్యలు మొదలయ్యాయి. ఈ మేరకు కమీషన్ తో పాటు పలు అంశాల్లో వారికి లబ్ది చేకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, డీలర్ల జేఏసీ నేతలు చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ ను మెట్రిక్ టన్నుకు రూ. 900ల నుండి రూ. 1400లకు పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి గంగుల ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 17227 మంది డీలర్లకు ఇచ్చే కమీషన్ కోసం అదనంగా రూ. 139 కోట్ల భారం పడనుందని, రాష్ట్ర ఆవిర్బావం నాటికి ఇప్పటికీ పోలిస్తే ఏడు రెట్ల మేర కమీషన్ పెంచినట్టయింది. కరోనా సమయంలో చనిపోయిన 100 మంది డీలర్ల కుటుంబాలకు కారుణ్య నియామకం ద్వారా వారి కుటుంబాలకు షాపులకు కెటాయిస్తామని, అలాగే రూ. 5 లక్షల బీమా అమలు, ఆరోగ్య శ్రీ పరిధిలోకి డీలర్లను చేర్చడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఖచ్చితమైన తూకం వేయించడం కోసం వే బ్రిడ్జిలను ఏర్పాటు చేయడం, డీలర్ షిప్ రెన్యూవల్ ఐదేళ్లకు పెంచడం, వయో పరిమితిని 40 నుండి 50 ఏళ్లకు పెంచడంతో పాటు అంత్యక్రియల నిర్వహణ కోసం తక్షన సాయం కింద రూ. 10 వేలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాకుండా 1.5 క్వింటాళ్ల వేరియేషన్ ను కేసుల పరిధి నుండి తీసేయడం, హైదరాబాద్ లో రేషన్ భవన్ కోసం స్థలం కెటాయింపు వంటి అంశాలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ చర్చల్లో సివిల్ సప్లై కమిషనర్ వి అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిదులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవిందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page