దిశ దశ, కరీంనగర్:
వైన్ షాపుల ముందు 18 ఏళ్లు నిండని వారికి మద్యం అమ్మకాలు చేయం అన్న స్లోగన్స్ రాయడం చూస్తుంటాం. కానీ కొన్ని చోట్ల మాత్రం వైన్ షాపు యజమానులు బీర్ల విక్రయాలపై కూడా కంట్రోల్ విధానం అమలు చేస్తున్నామంటూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీర్ల కరువు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఏనాడు లేని విధంగా ఎండలు మండిపోతుండడంతో చల్లని బీరు తాగి చిల్ అవుదామనుకుంటున్న వారికి షార్టేజ్ ఎఫెక్ట్ చుక్కలు చూపిస్తున్నట్టుగా ఉంది. వేసవి కాలంలో పెద్ద మొత్తంలో అమ్మకాలు జరిగే బీర్లు అందుబాటులో లేకపోవడంతో వైన్ షాపుల యజమానులు సరికొత్త పద్దతిని ఎంచుకున్నారు. ఒక్కోక్కరు పదుల సంఖ్యలో బీర్లు కొనుగోలు చేస్తుండడంతో మద్యాహ్యం వరకే స్టాక్ అమ్ముడుపోతోంది. దీంతో ఆ తరువాత వచ్చిన వారికి బీర్లు విక్రయించే పరిస్థితి లేకుండాపోతోందని గమనించారు కొంతమంది వైన్ షాపు యజమానులు. షార్టేజీకి విరుగుడు కనిపెట్టాలని భావించిన వారు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఐఎంఎల్ డిపోలో కూడా డిమాండ్ కు తగ్గట్టుగా బీర్ల స్టాక్ అందుబాటులో ఉండకపోవడంతో వైన్ షాపుల ముందు ‘నో స్టాక్’ బోర్డు పెట్టడం కంటే మరో దారి ఎంచుకుంటే బెటర్ అనుకున్నారు. బీరు ప్రియులందరిని సంతృప్తిపర్చడంతో పాటు తమ షాపులకు వచ్చే కస్టమర్లకు సమన్యాయం అందించినట్టవుతుందని భావించిన మద్యం దుకాణదారులు ‘‘ఒకరికి ఒకటే బీరు’’ విక్రయిస్తామంటూ ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేశారు. దీనివల్ల తమ షాపునకు వచ్చే బీరు ప్రియులకు అన్ని వేళల్లో బీర్లు అందుబాటులో ఉంచినట్టు అవుతుందని భావించి ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. నిన్న మొన్నటి వరకు కార్టన్లకొద్ది బీర్లు తీసుకెళ్లిన ప్రియులు ఇప్పుడు ఒక్కో బీరు కోసం వైన్ షాపు వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలోని పలు వైన్ షాపుల ముందు కనిపిస్తున్న ఈ తరహా బోర్డులను చూసిన బీరు ప్రియులు నిరుత్సాహానికి గురవుతున్నారు.