కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మురికి కూపాలుగా మారుతుండటంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రైలులో ఆహార ప్యాకెట్లు, చెత్తచెదారానికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైళ్లను చెత్తకుప్పలా మారుస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ పౌరులు కేంద్ర రైల్వే మంత్రిని కోరుతున్నారు.
వందే భారత్ రైళ్లలో చెత్తచెదారం వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. దీంతో పాటు రైల్వే అధికారులకు పలు సూచనలు చేశారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో శుభ్రపరిచే విధానాన్ని మార్చాలని, విమానాల క్లీనింగ్ ప్రక్రియను అనుసరించాలని అధికారులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు.
కొత్త క్లీనింగ్ సిస్టమ్ ప్రకారం.. ఒక వ్యక్తి రైలు కోచ్‌ల మీదుగా చెత్త బ్యాగ్‌తో ప్రయాణీకుల దగ్గరకు వెళ్తాడు. ఈ బ్యాగ్‌లో తమ దగ్గర లేదా చుట్టూ ఉన్న చెత్త వేయాలంటూ ప్రయాణీకులను అభ్యర్థిస్తుంటాడు. ఈ మేరకు కేంద్ర మంత్రి ట్వీట్ చేస్తూ.. వందే భారత్ రైళ్లకు క్లీనింగ్ సిస్టమ్ మార్చాం.. మీ సహకారం అందుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన రైళ్లను శుభ్రంగా ఉంచాలని, చెత్తను డస్ట్‌బిన్‌లలో వేయాలని రైల్వే ప్రయాణికులను కోరారు.