బీజేపీలో బీసీ నినాదం పనిచేయడం లేదా..?

వేములవాట అభ్యర్థి మార్పు దేనికి సంకేతం..?

దిశ దశ, వేములవాడ:

వేములవాడ బీజేపీ అభ్యర్థిగా మొదట ప్రకటించిన బీసీ మహిళా అభ్యర్థి తుల ఉమ పేరును చివరి నిమిషంలో పక్కన పెట్టేయడంతో కమలం పార్టీలో బీసీ నినాదం మరుగుపడిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ అభ్యర్థిగా చెన్నమనేని వికాసరావును ప్రకటించిన తరువాత బీసీ నేతల మధ్య వార్ మొదలైంది. బీజేపీ బీసీ నేత బండి సంజయ్ లక్ష్యంగా తుల ఉమ చేస్తున్న విమర్శలు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ‘దొర’ల కాళ్ల దగ్గర బీపారం పెట్టారంటూ తుల ఉమ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.

ఆ ఇద్దరి మధ్యా..

అయితే తాజాగా బీజేపీలో నెలకొన్న వర్గ విబేధాలు కూడా అభ్యర్థుల పేర్లు తారుమారు కావడానికి ఓ కారణం అన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఆ జాబితాలోనే ఉన్న వేములవాడ విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందన్న అనుమానాలు ఇంటా బయటా వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కి, హుజురాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ కు మధ్య వర్గ గత కొంతకాలంగా అభిప్రాయ బేధాలు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సంజయ్ ని బాధ్యతల నుండి తప్పించడంలో ఈటల రాజేందర్ సమీకరణాలు నెరిపారన్న వాదన కూడా కమలం పార్టీలో నెలకొంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో అభ్యర్ధుల ఎంపికలోనూ ఇద్దరు నేతలు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు జరిపిన క్రమంలోనే వేములవాడ టికెట్ విషయంలో చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. టికెట్ ఆశించిన తుల ఉమకు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చిన తరువాత ఆమె చేస్తున్న ప్రకటనలు కూడా ఇదే విధంగా ఉంటున్నాయి. తనకు టికెట్ రాకపోవడానికి కారణం బండి సంజయేనని, తనను బొందపెట్టి అగ్రవర్ణాలకు పార్టీ టికెట్ ఇచ్చారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఎపిసోడ్ అంతటికీ ప్రధాన కారణం బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య ఏర్పడిన గ్యాపేనని, ఈటల రాజేందర్ ద్వారా బీజేపీలో చేరినందున సంజయ్ సపోర్ట్ చేయలేదని ఉమ వర్గం ఆరోపిస్తోంది. తన ఎంపీ పరిధిలోని సెగ్మెంట్ విషయంలో ఈటల రాజేందర్ జోక్యం ఎలా చేసుకుంటారని తనకు అనుకూలంగా ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని బండి సంజయ్ పట్టుబట్టి ఖరారైన తుల ఉమకు అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేయించారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

ముగ్గురు బీసీలే…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టికెట్ల పంచాయితీ వ్యవహారంలో ముగ్గురు బీసీ నేతల మధ్యే పంచాయితీ రాజుకోవడం విచిత్రం. ఓ వైపున రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటిస్తే ఉమ్మడి జిల్లాలో మాత్రం ముగ్గురు బీసీ నాయకుల మధ్యే విబేధాలు చోటు చేసుకోవడం విచిత్రం. వేములవాడ అభ్యర్థి విషయంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ లు ఇద్దరు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండగా ఈ ప్రభావం తుల ఉమకు టికెట్ కెటాయించడంపై పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బీసీకార్డు నినాదం ఎత్తుకున్న బీజేపీ బీసీ నేతల మధ్యే టికెట్ చిచ్చు రాజుకోవడం విస్మయం కల్గిస్తోంది.

You cannot copy content of this page