టీచర్లకు కొత్త పరీక్ష

జగిత్యాలలో కొత్త పద్దతి

దిశ దశ, జగిత్యాల:

రాష్ట్రంలోని మిగతా జిల్లాలకంటే వైవిద్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆ జిల్లా విద్యాధికారులు. గతంలో ఏనాడూ లేని విధానాన్ని అమలు చేస్తూ అక్కడి ఉపాధ్యాయులకు సరికొత్త పరీక్ష పెట్టారు. జగిత్యాల జిల్లాలో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారింది.

అసలేంటీ..?

సాధారణంగా 1 నుండి 9వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు పేపర్లను తయారు చేసి పంపిస్తుంటారు. ఇందులో 5వ తరగతి పరీక్ష పత్రాలు ఓపెన్ కవర్లలో, 6 నుండి 9వ తరగతి క్వశ్చన్ పేపర్లు సీల్డ్ కవర్లలో పంపించడం ఆనవాయితీ. వీటిని డీఈఓ కార్యాలయాల నుండి ఎమ్మార్సీకు పంపిస్తే అక్కడి నుండి సంబధిత పాఠశాలల హెడ్ మాస్టర్లు ఒక రోజు ముందు స్వాధీనం చేసుకుని తమ పాఠశాలల్లో భద్రపరుస్తుంటారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షా పత్రాలు అన్ని కూడా హెడ్ మాస్టర్లు ఒకే సారి తీసుకుని సబ్జెక్టుకు సంబంధించిన పేపర్ ను పరీక్ష నిర్వహించే సమయానికి 15 నిమిషాల ముందు సీల్డ్ కవర్ ఓపెన్ చేసి టీచర్లకు అప్పగిస్తారు. అయితే జగిత్యాల జిల్లాలో మాత్రం ఈ సారి ఈ విధానానికి స్వస్తి చెప్పిన అధికారులు నూతన పద్దతికి శ్రీకారం చుట్టారు.

రోజు వారి పేపర్లు…

ఏ రోజు పేపర్లు ఆరోజు ఎమ్మార్సీ బిల్డింగ్ నుండి సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ కలెక్ట్ చేసుకోవల్సి ఉంటుందని ఇందుకు ముందుగానే వెల్లి వాటిని స్వాధీనం చేసుకుని పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించాలని డీఈఓ కార్యాలయం నుండి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో బుధవారం నుండి జరగనున్న పరీక్షలకు సంబంధించిన పేపర్లను కలెక్ట్ చేసుకునేందుకు సంబంధిత పాఠశాలల బాధ్యులు రెండు గంటల ముందే ఎమ్మార్సీ బిల్డింగ్ వద్దకు చేరుకోవల్సి ఉంటుంది. రవాణా సౌకర్యాలు లేని గ్రామాలకు అయితే టీచర్లే సొంత వాహనాల్లో వెల్లి పేపర్లను తీసుకుని పాఠశాలలకు వెల్లాల్సి ఉంటుంది. ఏటా జరిగే విధంగా కాకుండా ఈ సారి కొత్త పద్దతిని అమలు చేస్తుండడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను గమనించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అటు స్పాట్… ఇటు కలెక్ట్…

బుధవారం హౌస్కూల్స్ లో పనిచేసే టీచింగ్ యంత్రాంగం సగానికి సగం స్పాట్ వాల్యూయేషన్ డ్యూటీలకు వెల్లాల్సి ఉంటుంది. దీంతో స్కూళ్లలో మిగిలే అరకొర టీచర్లతో పరీక్షల నిర్వహణే ఇబ్బందికరంగా ఉండనుందంటే తాజాగా జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల మరింత ఇబ్బంది ఎదురు కానుంది. మండలంలోని అన్ని పాఠశాలలకు సంబంధించిన పరీక్ష పేపర్లు ఎమ్మార్సీ బిల్డింగ్ లోనే తీసుకోవల్సి ఉన్నందున ఏక కాలంలో టీచర్లు అక్కడకు చేరుకున్నట్టయితే ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఎమ్మార్సీకి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకునే ఆవశ్యకత ఏర్పడింది. అయితే ముఖ్యంగా కేవలం మహిళా టీచర్లు ఉన్న స్కూళ్లలో అయితే మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవని స్పష్టం అవుతోంది. మండల కేంద్రానికి చివరన ఉన్న గ్రామానికి చెందిన ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటోనన్న విషయాన్ని కూడా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అధికారులు ఎమ్మార్సీకే పేపర్లను పరిమితం చేయకుండా కనీసం కాంప్లెక్స్ స్కూల్ వరకు చేర్చినా రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండేది.

అంతర్మథనంలో టీచర్లు…

అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్ వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పద్దతిని అవలంభిస్తున్న అధికారులు కేవలం జగిత్యాల జిల్లాకే పరిమితం చేయడం చర్చకు దారి తీసింది. ఇక్కడి ఉపాధ్యాయుల్లో కూడా కొంత అంతర్మథనం మొదలైనట్టుగా తెలుస్తోంది. తమను అనుమానించినట్టుగా విద్యాశాఖ అధికారుల నిర్ణయం ఉందన్న ఆవేదన పలువురిలో వ్యక్తమవుతోంది.

You cannot copy content of this page