దిశ దశ, హైదరాబాద్:
మహిళా బిల్లు అమలుకు మరింత గడువు దొరకడంతో నేతలు ఊపిరి తీసుకున్నట్టయింది. వెంటనే బిల్లును అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటే ఎలా అన్న తర్జనభర్జనలకు బ్రేకు వేస్తూ కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. జనాభా గణన పూర్తయిన తరువాత డీలిమిటేషన్ ప్రక్రియ జరిపి అప్పుడు మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని కేంద్ర మంత్రి లోకసభలో బిల్లును ప్రవేశ పెడుతూ ప్రకటించారు. దీంతో ఈసారి ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు లోకసభ బరిలో నిలిచేవారికి ఉపశమనం లభించినట్టయింది. ఈ సారి తాము ఎంచుకున్న నియోజకవర్గాల్లోనే పోటీ చేసే అవకాశం ఉందన్న సంతోషం వ్యక్తం అవుతోంది పలువురు ఆశావాహుల్లో. అలాగే వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ నియోజకవర్గాలపై కూడా కన్నేసి అక్కడ తమ బలాన్ని పెంచుకునేందుకు కావల్సినంత సమయం కూడా చిక్కినట్టయిందన్న ఆనందం కూడా వ్యక్తమవుతోంది. దీంతో ఇరుగు పొరుగు నియోజకవర్గాలపై ఆశావాహుల ఆశలు మాత్రం సజీవంగా ఉన్నాయనే చెప్పవచ్చు. చట్ట సభల్లో 33 శాతం సీట్లు మహిళలకు కెటాయించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదయోగ్యంగా ఉన్న నేపథ్యంలో బిల్లు పాస్ కావడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో తమ భవితవ్యం ఎలా అని తలలు పట్టుకుంటున్న ఆశావాహులకు మాత్రం వెసులుబాటు దొరికినట్టయింది. రానున్న ఎన్నికల వరకు ఇతర నియోజకవర్గాల్లో తమ బలాన్ని, బలగాన్ని పెంచుకునేందుకు అవకాశం దొరకినట్టయింది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39 నుండి 40 సీట్లు మహిళలకు కెటాయించాల్సి వస్తోంది. ఇందులో 8 లేదా 9 సీట్లు రిజర్వూ స్థానాల్లో అలాట్ కావల్సి ఉండగా మిగతావన్ని కూడా ఇతర స్థానాల్లో ఆడవారికి కెటాయించాల్సిందే. ఎక్కువ శాతం మహిళలు ఉన్న నియోజకవర్గాలను గుర్తించి మొదటి వరసలో నిలిచే స్థానాల్లో రిజర్వేషన్ అమలు చేసే అవకాశాలు ఉంటాయి. ఆయా స్థానాల్లో ఇప్పటికే సిట్టింగులుగా ఉన్న వారు, అక్కడి నుండి బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్న వారు మాత్రం 2026 తరువాత జరిగే ఎన్నికల్లో బరిలో నిలిచే అవకాశం ఉండదు. కాబట్టి వీరంతా కూడా తమ సామాజిక వర్గాలు, అనుకూలతలు ఉన్న ఇతర నియోజకవర్గాలను ఎంచుకునే అవకాశం లేకపోలేదు. ప్రధానంగా బలహీనంగా ఉన్న నాయకులు టికెట్ ఆశిస్తున్న నియోజకవర్గాలు అయితే మరీ మంచిదని కూడా భావించి ఇందుకు తగ్గట్టుగా ఆయా చోట్ల పావులు కదిపే అవకాశాలూ లేకపోలేదు.
వారికి వరం…
మరో వైపున బిల్లు అమలుకు మరికొంత సమయం లభించిన నేపథ్యంలో మహిళాలకు కెటాయించే అవకాశం ఉన్న స్థానాల్లోనూ నాయకులు తమ పట్టు నిలుపుకునేందుకు వ్యూహం రచించుకునే అవకాశాలు లేకపోలేదు. ఇందు కోసం తమ కుటుంబంలోని మహిళలను పొలిటికట్ ఎంట్రీ ఇచ్చేందుకు సానుకూల వాతావరణాన్ని కూడా సిద్దం చేసుకోనున్నారు. దీనివల్ల తమ కుటుంబ ప్రాతినిథ్యం ఉంటుందని భావించి ఇప్పటి నుండే మహిళా రిజర్వుడ్ స్థానాల్లో పావులు కదపనున్నారు. ఏది ఏమైనా మహిళా బిల్లు అమలు అయ్యే నాటికి బలమైన నాయకులు మాత్రం తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఎత్తులు వేస్తూ ముందుకు సాగే అవకాశం అయితే లేకపోలేదు.