దిశ దశ, కరీంనగర్:
గ్రానైట్ అక్రమాలపై విజిలెన్స్ విభాగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపేందుకు సమాయత్తం అయింది. తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో విస్తరించుకున్న గ్రానైట్ తవ్వాకలే అయినా, ఎగుమతుల విషయంలో అయినా అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రానైట్ పై విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించిందే కానీ గతంలో వెలుగులోకి వచ్చిన అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పదేళ్ల క్రితం…
పదేళ్ల క్రితం ఒక్క కరీంనగర్ జిల్లా నుండి చైనాకు ఎగుమతి అయిన గ్రానైట్ విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇందులో సీనరేజ్ పెద్ద ఎత్తున ఎగవేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అప్రైజల్ రిపోర్ట్ నంబర్ 60 ద్వారా గ్రానైట్ రవాణాలో చోటు చేసుకున్న అక్రమాలపై నివేదిక ఇచ్చారు. 2013 మే నెలలో ఇచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం రూ. 124,94,46,147 సీనరేజ్ ఎగవేసి గ్రానైట్ బ్లాకులను కరీంనగర్ జిల్లాలోని వివిధ రైల్వే స్టేషన్ల మీదుగా అక్రమ రవాణా చేశారు. మైనింగ్ యాక్టు ప్రకారం ఐదు రెట్ల జరిమానా అంటే రూ. 749,66,76,882 విధించాలని విజిలెన్స్ అధికారులు అప్రైజల్ రిపోర్ట్ 60, C.NO.258/NRI/2013 తేది: 29.05.213న స్పష్టం చేశారు. 198 లీజు దారులకు సంబంధించిన గ్రానైట్ బ్లాకులను 8 ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీల ద్వారా రవాణా చేశారని కూడా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆ లేఖలో స్పష్టంగా వివరించింది.
మినహాయింపు…
అయితే ఈ విషయంలో గ్రానైట్ ఏజెన్సీలు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తమపై వేసిన పైవ్ టైమ్స్ పెనాల్టీలో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చాయి. అయితే ఈ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ. 124,94,46,147 కోట్ల విలువ చేసే గ్రానైట్ కు అదనంగా వన్ టైం పెనాల్టి చెల్లించాలని మెమో విడుదల చేసింది. కానీ ఇప్పటి వరకు వన్ ప్లస్ వన్ పెనాల్టీ కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేదని తెలుస్తోంది. నామ మాత్రంగా కొంతమేర డబ్బు చెల్లించి చేతులు దులుపుకోవడంతో సరిపెట్టిన గ్రానైట్ ఏజెన్సీలు మిగతా జరిమానా కట్టలేదని సమాచారం. అయితే ఈ పెనాల్టీ తాలుకూ డబ్బును వసూలు చేసేందుకు మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఆయా ఏజెన్సీల నుండి పదేళ్లయినా జరిమానా రికవరీ చేయడంలో అధికార యంత్రాంగం మీనామేషాలు లెక్కిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది.
అది సాధ్యమేనా..?
అయితే కరీంనగర్ గ్రానైట్ ఏజెన్సీలపై విధించిన జరిమానా మినహాయింపు ఇవ్వడం కూడా చట్టప్రకారం చెల్లుతుందా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. విజిలెన్స్ అధికారులు మైనింగ్ యక్టు 26(3)(i)&(ii) of APMMC Rules 1966 ప్రకారం ఐదు రెట్ల పెనాల్టీని వసూలు చేయాలని అప్రైజల్ రిపోర్ట్ లో వివరించారు. అయితే ఈ పెనాల్టీలో మినహాయింపు ఇవ్వడానికి ఎలాంటి అధికారాలు కూడా లేవని తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో పెనాల్టీని తగ్గించాలంటే ఖచ్చితంగా చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని స్పష్టం అవుతోంది. గతంలో దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇదే యాక్టు ప్రకారం పెనాల్టీలు విధిస్తే మినహాయింపు ఇవ్వలేదని, కోర్టులను ఆశ్రయించినా గ్రానైట్ ఏజెన్సీలకు అనుకూలమైన తీర్పు రాలేదు. దీంతో ఆయా రాష్ట్రాలలో మైనింగ్ యాక్టు ఉల్లంఘనులు చేసేదేమి లేక జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అయితే తెలంగాణాలో మాత్రం గ్రానైట్ ఏజెన్సీలపై వేసిన జరిమానా తగ్గించడం విచిత్రమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున కరీంనగర్ గ్రానైట్ వ్యవహారాలపై ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేపట్టింది. కరీంనగర్ లోని గ్రానైట్ రీచులపై లీజు దారులకు సంబంధించిన ఆఫీసులపై దాడులు చేసి రికార్డులు కూడా స్వాధీనం చేసుకుంది. అయితే ఈడీ విచారణతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అధికారులు ఇచ్చిన అప్రైజల్ రిపోర్ట్ ను అనుసరించి గ్రానైట్ ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీలతో పాటు 198 లీజ్ హోల్డర్ల నుండి పెనాల్టిని వసూల చేయవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విజిలెన్స్ తనీఖీలు చేపట్టడంతో పాటు పదేళ్ల క్రితం వేసినా పెనాల్టీని కూడా వసూలు చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంతమేర ఆర్థిక భారం తగ్గినట్టు అవుతుంది.