తెలంగాణ ఎన్నికల బరిలో టీఆర్ఎస్

ఈసీఐ ఆమోదం… గ్యాస్ సిలెండర్ గుర్తు అలాట్

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో కొత్త పార్టీకి భారత ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ఈ పార్టీ సమాయాత్తం కానుంది. తెలంగాణ రాజ్య సమతి (టీఆర్ఎస్) పేరిట ఏర్పడిన ఈ పార్టీకి గుర్తింపు ఇవ్వడమే కాకుండా, గ్యాస్ సిలిండర్ గుర్తును కూడా కెటాయించింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇదే గుర్తుపై అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అవకాశం ఇచ్చింది.

ఇబ్బంది ఎవరికో..?

అయితే తాజాగా ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇచ్చిన పార్టీతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. 2001లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఇటీవల భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ గా మారిపోయి జాతీయ పార్టీగా అప్ గ్రేడ్ అయినట్టుగా గులాభి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయినప్పటికీ రెండు దశాబ్దాలకు పైగా ఉన్న అనుబంధం వల్ల కొంతమంది ఓటర్లు టీఆర్ఎస్ పార్టీ అంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాజ్య సమితే ఉద్యమ పార్టీ అని బావించే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన లేకపోలేదు. అయితే తెలంగాణ రాజ్య సమితి అన్ని చోట్ల అభ్యర్థులను నిలబెట్టినట్టయితే అధికార బీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున కొత్తగా ఏర్పడిన ఈ పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తు కెటాయించడం కూడా ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టినట్టయింది. పెరిగుతున్న వంట గ్యాస్ సిలిండర్ ధరలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహ రచన చేసుకున్నాయి. తమపై ఆర్థిక భారం పడుతుందని భావించే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై మహిళలు ఎలా ఇబ్బంది పడుతున్నారో చెప్పేందుకు ఇంతకాలం ఆయా పార్టీలు గ్యాస్ సిలిండర్లతో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాజ్య సమితి పార్టీ ఎన్నికల గుర్తు గ్యాస్ సిలిండర్ కావడంతో దానితో ప్రచారం చేసినట్టయితే ఆ పార్టీకి ప్రమోషన్ చేసినట్టు అవుతుందని వివిధ పార్టీల నాయకులు భావించే అవకాశం ఉంది. దీంతో గ్యాస్ ధరలు ఆకాశన్నంటుతున్నాయని, సామాన్యునిపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

2018 ఎన్నికలు రిపిటా..?

అయితే గత ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో తాము నట్టేట మునిగిపోయామని, కొన్ని చోట్ల తమ పార్టీ అభ్యర్థుల తల రాతలు మారిపోయాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కారును పోలి ఉన్న గుర్తులు ట్రక్, రొట్టెల పీట వంటి వాటిని ఎన్నికల కమిషన్ జాబితా నుండి తొలగించాలని కూడా కోరుతూ గులాభి పార్టీ నేతలు లేఖ కూడా రాశారు. దీంతో ఈ సారి కారును పోలిన గుర్తులు లేకపోవడం వల్ల తమకు కొంతమేర లాభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న క్రమంలో ఇప్పుడు ఏకంగా టీఆర్ఎస్ పేరిట మరో కొత్త పార్టీ ఆవిర్భవించడం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు. దీంతో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాకుండా బీఆర్ఎస్ తమ పార్టీ అని పదే పదే చెప్పుకోవల్సిన ఆవశ్యకత గులాభి శ్రేణులపై పడింది. ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ తాజాగా గుర్తింపు ఇచ్చిన తెలంగాణ రాజ్య సమతి ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

You cannot copy content of this page