కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు తెరపైకి..?

దిశ దశ, కరీంనగర్: 

లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు కసరత్తులు మొదలు పెట్టాయి. రాష్ట్రంలోనే అత్యంత ప్రాథాన్యత పొందిన నియోజకవర్గాల్లో ఒకటైన కరీంనగర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇవ్వాలోనన్న అంశంపై పార్టీల ముఖ్య నాయకులు  అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగపతి రావు తనయుడు పీఆర్పీ పార్టీలో కీలకంగా పనిచేసిన వెలిచాల రాజేందర్ రావుల పేర్లు మొదట వినిపించినా ఆ తరువాత మరికొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుండగా,  ఆయనకు నిజామాబాద్ ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు కూడా పరిశీలనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కరీంనగర్ నుండి బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలన్న సంకల్పంతో అన్వేషణ కొనసాగిస్తున్నారు. అటు పార్టీ బలం, ఇటు వ్యక్తిగత ఇమేజ్ రెండు కలిసొస్తే బావుంటుందని, ఫలితాలు సానుకూలంగా అందుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆలోచిస్తున్నారు. 

తాజాగా సరికొత్త పేరు…

కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కొత్త నాయకుడి పేరు ప్రతిపాదనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీను బాబుకు కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వాలన్న ప్రపోజల్ అధిష్టానం పెద్దల ముందు చేరినట్టుగా సమాచారం. 1999లో శ్రీధర్ బాబు ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి శ్రీను బాబు కూడా పాలిటిక్స్ లో తిరుగుతున్నారు. మంథని ఎమ్మెల్యే విషయంలో అన్న గెలుపులో తనవంతు భాగస్వామ్యాన్ని అందించిన శ్రీను బాబు ఇంతకాలం అన్న చాటు తమ్ముడిగానే వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీధర్ బాబు గెలుపు కోసం మంత్రాగం నెరపడం, యూత్ ఫాలోయింగ్ తో ప్రచారం నిర్వహిస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేనందున శ్రీను బాబుకు అవకాశం ఇచ్చినట్టయితే సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు చేసిన అనుభవం, మంత్రిగా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పడిన పరిచయాలు శ్రీను బాబుకు కలిసొస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనను పోెటీలో ఉంచినట్టయితే అన్నింటా లాభం చేకూరుతుందని అంటున్నారు. తాజాగా తెరపైకి వచ్చిన శ్రీను బాబును కరీంనగర్  ఎంపీగా పోటీ చేయించాలన్న ప్రతిపాదనలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

You cannot copy content of this page