పూర్వశ్రమానికి చేరుకున్నమనవడు
హుజురాబాద్ పాలి’ట్రిక్స్’
దిశ దశ, హుజురాబాద్:
వొడితెల కుటుంబంలో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకాలం ఒక్కటిగా ఉన్న ఆ కుటుంబం రాజకీయంగా రెండుగా చీలిపోయింది. ఏడు దశాబ్దాల చరిత్రలో అంతా ఒకటై కదిలిన ఆ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పటి వరకు…
దేశ రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేసిన వొడితెల ఫ్యామిలీలో రాజేశ్వరరావు బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. సింగాపురం రాజేశ్వర్ రావుగా పిలుచుకునే ఆయన పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల మార్పులు, చేర్పుల సమయంలోనూ ఆయన ప్రమేయం తీవ్రంగా ఉండేది. అయితే పీవీ తర్వాత వొడితెల కుటుంబం రాజకీయంగా కొంతకాలం తెరవెనక్కి వెళ్లినట్టయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉద్యమం చేపట్టేందుకు జరుగున్న సమీకరణాలప్పుడు రాజేశ్వరరావు కేసీఆర్ కు అండదండలు అందించారని కూడా ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఇదే సమయంలో రాజేశ్వరరావు వారసులు వ్యాపారాలకు పరిమితం కాగా ఆయన సోదరుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. మరోవైపున వొడితెల రాజేశ్వరరావు మరణించడంతో రాజకీయాలకు ఆయన సొంత వారసులు కంప్లీట్ గా దూరం అయ్యారని చెప్పవచ్చు. నామమాత్రపు పదవులతోనే సింగాపురం రాజేశ్వరరావు ఫ్యామిలీ సరిపెట్టుకోవల్సి వచ్చింది.
మూడు నాలుగేళ్లుగా…
అయితే తాత వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రణవ్ బాబు గత మూడు నాలుగేళ్లుగా హుజురాబాద్ ప్రాంతంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలన్న ఉత్సుకత కూడ ఉన్న ప్రణవ్ ఓ సారి జడ్పీటీసీ టికెట్ కూడా ఆశించి భంగపడ్డారు. కెప్టెన్ లక్ష్మీ కాంతరావు వారసులకు ఇస్తున్న ప్రాధాన్యతలో కొద్దిపాటి ప్రయారిటీ కూడా లభించకపోవడం రాజేశ్వరరావు ఫ్యామిలీని మానసికంగా ఇబ్బంది కల్గించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రణవ్ బాబు కూడా తనవంతు ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని ఆటంకాలు ఎదురు కావడంతో ఆయన ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి రాలేకపోయారని ఆయన హితులు అంటున్నారు. ఇటీవల రాజేశ్వరరావు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించినప్పుడు ఆయన వారసుడిగా ప్రణవ్ కు మంచి భవిష్యత్ ఉందని మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. దీంతో ప్రణవ్ బాబుకు ప్రాధాన్యత లభిస్తుందని అంతా భావించారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఆయనకు అవకాశం కల్పించే దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రణవ్ ప్రత్యేక దారి చూసుకుంటే మంచిదన్న ఒత్తిళ్లు కూడా మొదలయ్యాయి. ఇంటా బయట కూడా ప్రణవ్ ప్రత్యామ్నాయం ఆలోచించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో పక్షం రోజుల క్రితమే ప్రణవ్ బాబు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. అధికారికంగా మాత్రం శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఫ్యామిలీ వారించినా..?
అయితే ప్రణవ్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై వొడితెల ఫ్యామిలీలో తీవ్రమైన చర్చ సాగినట్టుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరవద్దని వారించినప్పటికీ ఆయన మాత్రం ముందుకే సాగారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వద్ద కాంగ్రెస్ పార్టీలో చేరే లాంఛనం పూర్తి కావడం సంచలనంగా మారింది.