ఇరకాటంలో కాంగ్రెస్ అధిష్టానం
దిశ దశ, జగిత్యాల:
నాలుగు దశాబ్దాలకు పైగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న ఆయన ఒక్కసారిగా అధిష్లానంపై ఆగ్రహంతో ఊగిపోయారు. తన అనచరుడి హత్యను ఖండిస్తూ ఏకంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం కదిలివచ్చి ఆయన్ని మెప్పించే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. అధిష్టానం పెద్దలు ఫోన్లో సంప్రదింపులు జరిపినా వెనక్కి తగ్గలేదు. ఆ ఎమ్మెల్సీ వ్యవహరించిన తీరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి షాకిచ్చినట్టయింది.
అసలేం జరిగిందంటే…
జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడిని మంగళవారం తెల్లవారుజామున హత్య చేశారు. యాక్సిడెంట్ చేసి కత్తితో పొడిచి చనిపోయాడని నిర్దారణ అయిన తరువాతే అక్కడి నుండి పరార్ అయ్యారు. ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేయాలని స్కెచ్ వేసుకున్న నిందితులు వాహనాలు, మారణాయుధాలను సమకూర్చుకుని చంపేసి పోలీసుల ముందు లొంగిపోయిన తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. గంగారెడ్డి హత్య జరిగిన సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో జగిత్యాల జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా అక్కడకు చేరుకోవల్సి వచ్చింది. తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని గంగారెడ్డి 100కు డయల్ చేసి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. గంగారెడ్డిని హత్య చేశారంటే అది తనపై దాడి చేసేందుకు సంకేతాలను ఇస్తోందన్నారు. పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే గంగారెడ్డి హత్య జరిగిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యం నడుస్తోందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా తనను మానిసకంగా వేదింపులకు గురి చేస్తున్నా తట్టుకుంటున్నానని, ఇప్పుడు తన ముఖ్య అనుచరుడినే చంపేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం లేపాయి.
అధిష్టానానికి ఝలక్…
గంగారెడ్డి హత్యకు నిరసనగా ఆందోళణ చేస్తున్న జీవన్ రెడ్డిని కలిసేందుకు ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై కూడా జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మీ కో పార్టీకో దండం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విస్మరించి ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి అందలం ఎక్కిస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. జీవన్ రెడ్డి అనుచరులు కూడా అడ్లూరి ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేసి తమ నిరసనను ప్రదర్శించారు. అయినప్పటికీ అడ్లూరి మాత్రం జీవన్ రెడ్డితో కలిసి ఉండి మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినా ఆయన సానుకూలంగా స్పందించలేదు. క్షమించండి అంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న మాటలు వినిపించుకోకుండానే ఫోన్ కట్ చేసేశారు. అనుచరుని హత్యను జీర్ణించుకోలేకపోతున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా పరోక్షంగా ఇరాకటంలోకి నెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ కావడంతో పాటు, పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డిని సముదాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు కూడా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన మాత్రం వారి ప్రతిపాదనల విషయంలో సానుకూలంగా స్పందించనట్టుగా సమాచారం.
రాజకీయాలకు దూరం…
మరోవైపున గంగారెడ్డి హత్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారాన్నే లేపుతున్నాయి. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎన్జీఓ పెట్టుకుని సేవ చేస్తానని చేసిన కామెంట్స్ పరోక్షంగా అధిష్టానికి చురక అంటించినట్టయింది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని పార్టీలోకి చేర్పించుకున్న విషయంలో కినుక వహించిన జీవన్ రెడ్డి తన అనుచరులకు పదవులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నా అధిష్టానం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇదే సమయంలో ఆయన రైట్ హైండ్ గంగారెడ్డి హత్యకు నిరసనగా ఆయన మాట్లాడిన తీరు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అంటూనే పాలిటిక్స్ కు దూరంగా ఉంటానని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసినట్టయింది. అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహంతో ఉన్న ఆయన గంగారెడ్డి హత్యతో తనలోని కోపాన్ని ప్రదర్శించడానికి వెనకాడలేదు. అధిష్టానం డిల్లీకి పిలిపించి మాట్లాడిన తరువాత నుండి బాహాటంగా అధిష్టానాన్ని తప్పుపట్టని జీవన్ రెడ్డి గంగారెడ్డి హత్యపై సీరియస్ అయిన తీరు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని చెప్పక తప్పదు.