Sand policy: కార్పోరేట్ కంపెనీల ద్వారా ఇసుక సేకరణ..?

రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో కొత్త యోచన…

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలోని నదుల్లో ఇసుక సేకరణపై కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇసుక వ్యాపారం ఎలా చేస్తే బావుంటుంది అన్న యోచనలో ఉన్న ప్రభుత్వం ఇందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నట్టుగా సమాచారం. జిల్లా యూనిట్ చేయాలా లేక రాష్ట్రం మొత్తం ఒక కంపెనీకి అప్పజెప్పాలా అన్న విషయాలపై కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు కూడా ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

కార్పోరేట్ కంపెనీకే..?

తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వినతిని బట్టి అయితే రాష్ట్రం మొత్తం ఒక కంపెనీకే అప్పగించాలన్న ప్రతిపాదనకు మొగ్గు చూపుతున్నట్టుగా అర్థం అవుతోంది. నదులు, ఉప నదుల్లో ఇసుక రిజర్వాయర్లు, చెక్ డ్యాంలలో డిసిల్ట్రేషన్ చేపట్టినట్టయితే అన్ని విధాల లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని జలవనరులన్నింటిలో కూడా ఇసుకను తొలగించేందుకు ఓ కార్పోరేట్ కంపెనీకి అప్పగించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మైనింగ్ కాంట్రాక్టు వ్యాపారంలో ఉన్న ఆ కంపెనీకి అప్పగిస్తారన్న ప్రచారం అయితే ఊపందుకుంది. ఏపీకి చెందిన సదరు కంపెనీకి అప్పగించినట్టయితే తాము రోడ్డున పడుతామని లారీల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఆలోచనను విరమించుకోవాలని తమకు బాసటగా నిలవాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే వినతి పత్రం అందించారు.

అలా అయితే…

కార్పోరేట్ కంపెనీలకు ఇసుక సేకరణ కాంట్రాక్టు అప్పగించినట్టయితే ఇసుక రవాణాపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లారీల యజమానులతో పాటు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఆదారపడ్డ కుటుంబాలన్నింటికి ఉపాధి లేకుండా పోతుందని లారీ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కార్పోరేట్ కంపెనీకి అప్పగించినట్టయితే ఆ కంపెనీ తన సొంత లారీలను మాత్రమే ఇసుక రవాణాకు ఉపయోగిస్తుందని, TGMDC నుండి నేరుగా వేబిల్లులు తీసుకుని ఇషుక రవాణా చేస్తున్న లారీలన్ని కూడా మూలన పడతాయని అంటున్నారు. ఒక్క ఇసుక రవాణాపై ఆధార పడి రాష్ట్రంలో 42, 280 లారీలు తిరుగుతున్నాయని, TGMDC నుండి వే బిల్లులు తీసుకుని హైదరాబాద్ వంటి నగరాలకు రవాణా చేస్తున్నామని అంటున్నారు. దీనివల్ల లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండగా పరోక్షంగా చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయని అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. కార్పోరేట్ కంపెనీకి ఇసుక రవాణా కాంట్రాక్టు అప్పగించినట్టయితే తమకు తీరని నష్టమేనని లారీ యజమానులు అంటున్నారు.

You cannot copy content of this page