సిమ్ కార్డులపై నియంత్రణ

కేంద్రం కఠిన నిర్ణయం…

ఒకరి పేరిట నాలుగు మాత్రమే…

దిశ దశ, న్యూ ఢిల్లీ:

సంఘ విద్రోహ శక్తులను అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. సైబర్ మోసాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో బల్క్ సిమ్ కనెక్షన్ విధానానికి కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేయనుంది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ టెలికాం సిస్టంపై తీసుకున్న నిర్ణయాలను గురువారం వెల్లడించారు. సిమ్ కార్డులు విక్రయించే డీలర్లు తప్పనిసరిగా పోలీసు దృవీకరణ పత్రం పొందాల్సిందేనని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు 9 సిమ్ కార్డులు ఒక వ్యక్తి పేరిట వినియోగించుకునే అవకాశం ఉండేది కానీ ఇక నుండి ఈ విధానంలో నాలుగుకే పరిమితం చేసింది. దేశ వ్యాప్తంగా 52 లక్షల మేర మోసాలకు పాల్పడే సిమ్ కనెక్షన్లను వినియోగిస్తున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ సిమ్ కార్డలను డియాక్టీవేట్ చేసింది. 67 వేల మంది డీలర్లను కూడా బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు 300 ఎఫ్ఐఆర్ లను కూడా నమోదు చేసిన కేంద్రం 66 వేల ఖాతాలను కూడా వాట్సప్ బ్లాక్ చేసింది. దేశంలో 10 లక్షల మంది సిమ్ కార్డు డీలర్లు ఉన్నారని వీరంతా కూడా పోలీస్ వెరిఫికేషన్ తీసుకునేందుకు సమయం కూడా కెటాయించినప్పటికీ ప్రతి ఒక్క డీలర్ విధిగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సిందేనని కేంద్ర స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధనలను అతిక్రమించిన డీలర్లపై కఠినంగా వ్యవహరించనుంది. రూ. 10 లక్షల జరిమానా కూడా విధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సిమ్ కార్డుకు కూడా కెవైసీ విధానం అమలు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపార అవసరాలకు తీసుకునే ప్రతి సిమ్ కార్డుకు కూడా కేవైసీ అమలు చేయాల్సిందేనని, గ్రూప్ సిమ్ కార్డుల్లో కూడా 20 శాతం సిమ్ కార్డులు దుర్వినియోగం అవుతున్నట్టు గుర్తించింది కేంద్రం. ఇక నుండి బల్క్ సిమ్ కనెక్షన్ పద్దతికి స్వస్తి పలికి ఇక నుండి బిజినెస్ కనెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్ అమలు చేయనుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

You cannot copy content of this page