దిశ దశ, హుజురాబాద్:
వైవిద్యమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన నియోజకవర్గాల్లో హుజురాబాద్ ఒకటి. ఇక్కడి ఓటర్లు రాజకీయ పార్టీల నాయకుల అంచనాలను తలకిందులు చేస్తూ తమ అభిప్రాయలను వెల్లడిస్తుంటారు. అత్యంత బలమైన నాయకులు బరిలో నిలిచినా బలహీనులనే అక్కున చేర్చుకున్న చరిత్ర కూడా హుజురాబాద్ సొంతం. అలాంటి నియోజకవర్గంలో తాజాగా సరికొత్త సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తోంది.
ఈ ఇద్దరి విషయంలో…
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2021 ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన పోటీకి దూరంగా ఉండగా, ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. 2021 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్క డి నుండి పోటీ చేసిన బల్మూరి వెంకట్ పోటీ చేయగా ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్ కు బదులుగా వొడితెల ప్రణవ్ బాబుకు అవకాశం కల్పించింది. అధిష్టానం. అప్పుడు బల్మూరి వెంకట్ ఇక్కడి నుండి టికెట్ ఆశించినప్పటికీ సమీకరణాల కారణంగా పార్టీ టికెట్ ఇవ్వలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ పేరును ప్రకటించింది. దీంతో హుజుారాబాద్ నుండి తొలి ఎన్నికల్లో పోటీ చేసి ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో అధిష్టానం సూచన మేరకు బరిలో నిలవని నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం వచ్చే సెంటిమెంట్ కొత్తగా స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తోంది. గత ఐదేళ్లలో చూసుకుంటే వీరిద్దరు నాయకులు కూడా ఇక్కడి పోెటీ చేసి ఓడిపోయి మరో ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించిన వారే కావడం గమనార్హం. కౌశిక్ రెడ్డి, బల్మూరి వెంకట్ లు ఎమ్మెల్సీలు కావడంతో తాజాగా ఈ చర్చ మొదలైంది.