Karimnagar: కరీంనగర్ లో నయా ట్రెండ్…

బెయిల్ పై వచ్చిన వ్యక్తికి స్వాగతం…

జైలు ముందే ఆర్భాటం

దిశ దశ, కరీంనగర్:

భూ దందా కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బెయిలుపై జైలు నుండి బయటకు రాగానే ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా జైలు ముందు అభిమానులు చెప్పిన ఘన స్వాగతానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత డిసెంబర్ 28న రేకుర్తిలోని సర్వే నంబర్ 74లో ఎకరం భూమికి ఫేక్ డాక్యూమెంట్లు తయారు చేసిన కేసులో పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి నకిలీ డాక్యూమెంట్లు తయారు చేయడంతో పాటు ఇంటి నంబర్లు కూడా సృష్టించారని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ మేరకు అరెస్ట్ అయిన ఆయనకు గత 4న కోర్టు బెయిల్ సాంక్షన్ చేసింది. దీంతో కరీంనగర్ జైలు నుండి బయటకు వచ్చిన ఆయనకు సన్నిహితులు చెప్పిన స్వాగతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సంబరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్చకు దారి తీసింది.

హైదరాబాద్ నుండి…

హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుండి ప్రత్యేకంగా వచ్చి స్వాగతం చెప్పడం కరీంనగర్ లో చర్చనీయాంశంగా మారింది. కోర్టులో కేసు విచారణ కొనసాగుతున్నప్పటికీ నిందితునికి బెయిల్ మాత్రమే ఇచ్చింది. అయినప్పటికీ విజయం సాధించినట్టుగా బెయిల్ వచ్చినందుకే ఈ స్థాయిలో సంబరాలు చేయడం ఎంటీ అన్న చర్చ స్థానికంగా సాగుతోంది. గతంలో డాన్లు, రౌడీ షీటర్లు జైలు నుండి బయటకు రాగానే ఇలాంటి స్వాగతాలు ఆనవాయితీగా కొనసాగుతాయి, ఇప్పుడు భూదందాలో నిందితులకు కూడా ఇలా ఘన స్వాగతం పలుకుతున్న తీరు సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టయిందా అని అడుగుతున్నారు నగర వాసులు. 

You cannot copy content of this page