ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆర్భాటం తీరు…
దిశ దశ, కరీంనగర్:
ట్రెండ్ మార్చుతున్నారా లేక సెట్ చేస్తున్నారో తెలియదు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మాత్రం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆరు నెలల ముందు నుండే అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దూకుడు ప్రదర్శిస్తుండగా నామినేషన్ల ప్రక్రియతో ఆర్భాటం పెరిగిందనే చెప్పాలి. సాధారణ ఎన్నికలను మరిపించే విధంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ప్రచారాల్లో పాల్గొంటుండడం గమనార్హం. భారీ ర్యాలీలు, సభలు, సమవేశాలు ఏర్పాటు చేస్తూ నయా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు. బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమురయ్యల నామినేషన్లు దాఖలు చేసిన తరువాత కనివిని ఎరగని రీతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు కరీంనగర్ నియోజకవర్గంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. కరీంనగర్ వీధుల్లో ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ కూడా నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసినప్పుడు కూడా హడావుడి చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరయ్యారు. వివిధ రోడ్ల మీదుగా బారీ ర్యాలీగా కరీంనగర్ కలెక్టరేట్ లోని ఎన్నికల అధికారి కార్యాలయం వరకు చేపట్టారు.
అప్పుడు…
గతంలో కూడా టీచర్స్, గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటికీ ఇంతటి ప్రచారం మాత్రం ఏనాడు చేయలేదన్న అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మాత్రమే కనిపించే ప్రచార హంగూ ఆర్భాటం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వంలోనూ సాక్షాత్కరిస్తున్న తీరుపై మేధావి వర్గాలు చర్చింకుటున్నాయి. అభ్యర్థి, ప్రతిపాదకులు, బలపర్చిన వారు వెల్లి నామినేషన్లు వేసి పట్టభద్ర ఓటర్లను, టీచర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించే వారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు వ్యక్తిగతంగా కలవడమో లేక తమ సహచరులు, అనుచరుల ద్వారా ప్రచారం కొనసాగించే వారు. ఒకరకంగా చెప్పాలంటే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అన్నట్టుగా ఏ మాత్రం సందడి లేకుండా ప్రచారం నిర్వహించుకునే వారు. కానీ ఈ సారి ఆనాటి పరిస్థితులకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తుండడం విచిత్రం. ఆయా పార్టీల ముఖ్య నేతలు కూడా ప్రకటనలు చేయడంతోనే సరిపెట్టుకునే వారు కానీ ఏకంగా ర్యాలీల్లో పాల్గొన్న సందర్భాలు మాత్రం లేవనే చెప్పాలి. పార్టీలు కూడా నాలుగు జిల్లాల్లోని ఓటర్లను ప్రభావితం చేయగలిగే అభ్యర్థులకు టికెట్ ఇచ్చేవి ఆయా పార్టీలు.
ఎంతమంది..?
నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ముక్కున వేలు వేసుకోవల్సిందే. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మొత్తం గ్రాడ్యూయేట్ ఓటర్లు 3లక్షల 58 వేల674 మంది ఉన్నారు. వీరిలో లక్షా 23 వేల మంది మహిళా ఓటర్లు ఉండగా, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 28,672 మంది ఉండగా వీరిలో 10 వేల మంది వరకు మహిళా ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల, టీచర్ల నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య మొత్తం కలిపితే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల సంఖ్య వరకు ఉంటుంది. 45 అసెంబ్లీ, ఆరు పార్ల మెంటు నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లు రెండు నియోజకవర్గాల అభ్యర్థులకు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల ప్రచారం తీరు మాత్రం అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఉండడం గమనార్హం.