దిశ దశ, కరీంనగర్:
ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారికి కూడా ఓటు హక్కు కల్పించింది ఎన్నికల కమిషన్. దీంతో ఈ సారి ఎన్నికల్లో ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలు కూడా టీచర్స్ నియోజకవర్గం నుండి పోటీ పడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో తయారైన ఓటరు జాబితా ఓ పచ్చి నిజాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న టీచర్లకు ఓటు హక్కు కల్పించడం పట్ల వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ విధానంతో ప్రైవేటు విద్యా రంగంలో అసలు ఏం జరుగుతోందన్న విషయం బట్టబయలు అయింది.
నిబంధనలు ఇవి…
సాధారణంగా ప్రైవేటు స్కూల్స్ విద్యా శాఖ నుండి అనుమతులు తీసుకుని ప్రారంభిస్తాయి. పర్మిషన్ల సమయంలో అయినా రికగ్నైజేషన్ రెన్యూవల్ సమయంలో అయినా అర్హులైన ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు, వారి పూర్తి వివరాలను విద్యాశాఖ కార్యాలయాల్లో ఆయా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు సమర్పిస్తాయి. ఇంటర్ మీడియెట్ విద్యా సంస్థలు అయితే ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయాలకు, డిగ్రీ విద్యా సంస్థలు అయితే సంబంధిత యూనివర్శిటీలు, సాంకేతిక విద్యా సంస్థలు టెక్నికల్ యూనివర్శీటీలు, మెడికల్ కాలేజీలు సంబంధిత మెడికల్ యూనివర్శిటీల్లో అనుమతులు తీసుకుంటారు. ఆయా విభాగాల నిబంధనల ప్రకారం పర్మిషన్ సమయంలో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీకి సంబంధించిన సర్టిఫికెట్లను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అదనపు తరగతులు నిర్వహించాల్సి వచ్చినప్పుడు అందుకు తగినట్టుగా టీచింగ్ స్టాఫ్ ను నియిమించాల్సి ఉంటుంది. వీరికి అపాయింట్ మెంట్ లెటర్, సర్వీస్ బుక్ మెయింటెన్ చేయడం, పీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుంది. అలాగే మూడు సంవత్సరాల పాటు బ్యాంకు అకౌంట్ల ద్వారా జీతం తీసుకున్న టీచర్లకు ఓటు హక్కు కల్పించారు. ద్వారా ఈ రికార్డులు అన్ని కూడా మెయింటెన్ చేసిన వారినే ఓటరుగా నమోదు చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను ఎన్నికల కమిషన్ కు అందించిన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించనుంది.
ఓటర్లు ఎంతమంది…?
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు 27088 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 4 వేల మంది వరకు ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న టీచర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కన ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అనుగుణంగా టీచింగ్ స్టాఫ్ ఆయా విద్యా సంస్థలు నియమించుకోలేదా..? లేక వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పించడం లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోనే 3 వేల నుండి 4 వేల వరకు ప్రైవేటు విద్యా సంస్థలు ఉంటాయని ఓ అంచనా. ఈ లెక్కన ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటరు జాబితా ఆదారంగా పూర్తి వివరాలు సేకరించినట్టయితే ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న నిబంధనల అతిక్రమణ జరుగుతున్న తీరు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పదో తరగతి వరకు నడిచే ప్రైవేటు పాఠశాలలో 10 నుండి 12 మంది టీచింగ్ స్టాఫ్ తో పాటు ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్(PET) పని చేయాల్సి ఉంటుంది. ఇంటర్ కాలేజీల్లో వారు అనుమతులు తీసుకున్న బ్రాంచులకు సంబంధించిన అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లను నియమించడంతో పాటు ఫిజికల్ డైరక్టర్లను కూడా నియమించాలన్ని నిబంధనలు చెప్తున్నాయి. ఇదే విధానం డిగ్రీ, ఇతర టెక్నికల్ కోర్సులకు సంబంధించి విద్యా సంస్థల్లో కూడా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ జాబితాలో నమోదయిన ప్రైవేటు విద్యా సంస్థల ఓటర్లకు ఆయా విద్యా సంస్థల్లో అమలవుతున్న నిబంధనల తీరుకు ఎంత వ్యత్యాసం ఎందో స్పష్టం అవుతోంది. దాదాపు అన్ని విద్యా సంస్థల్లో టీచింగ్ స్టాఫ్ అటు ఇటుగా నియమించుకున్నప్పటికీ వారందరికి ప్రభుత్వ నిబంధనల మేరకు జీతాలు ఇవ్వడం లేదని తేటతెల్లం అవుతోంది. విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రామాణికతలు పాటించడం లేదని అర్థం అవుతోంది. దీనివల్ల ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో్ వచ్చే ఆదాయానికి గండి పడితుండగా ఆయా విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కూడా లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. విద్యా శాఖకు చెందిన ఆయా విభాగాల అధికారులు ఎమ్మెల్సీ ఓటరు జాబితా ఆధారంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న తీరుపై సమగ్రంగా విచారణ చేయించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
విజిలెన్స్ రిపోర్ట్…
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కూడా రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు చేసి సమగ్రంగా నివేదిక ప్రభుత్వానికి పంపించారు. అప్పటి నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టయితే ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాల తీరును గుర్తించే అవకాశం కూడా ఉంటుంది.