మానేరు రీచుల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయండి… టీఎస్ఎండీసీ నుండి వసూలు చేయండి…

MoEF&CCని ఆదేశించిన ఎన్జీటీ…

దిశ దశ, జాతీయం:

మానేరు నదిపై ఏర్పాటు చేసిన ఇసుక రీచుల వ్యవహారంలో ఎన్జీటీ చెన్నై సౌత్ బెంచ్ కేవలం జరిమానాతోనే సరిపెట్టలేదు. ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ లేకుండా ఇసుక తవ్వకాలు జరపడం నిబంధనలకు విరుద్దమేనని తేల్చి చెప్పిన ఎన్జీటీ నష్టానికి సంబంధించిన వివరాలను సేకరించాలని మినిస్ట్రి ఫర్ ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమెట్ ఛేంజ్ విభాగాన్ని(MoEF&CC) ఎన్జీటీ ఆదేశించింది. మానేరు నదిపై ఏర్పాటు చేసిన ఇసుక రీచుల ద్వారా వచ్చిన రాయల్టీ, మార్కెట్ రేటు, పర్యావరణ నష్టాలను అంచనాలు వేసి వాటిని టీఎస్ఎండీసీ నుండి సేకరించాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. దీంతో మానేరు నదిపై ఏర్పాటు చేసిన ఇసుక రీచుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో వచ్చిన ఆదాయం, మార్కెట్ లో విక్రయించిన ధర, పర్యావరణ నష్టాలకు సంబంధించిన వివరాలను సేకరించినట్టయితే పెద్ద మొత్తంలో డబ్బును టీఎస్ఎండీసీ నుండి సేకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడనుంది. వందల కోట్లలోనే రాయల్టీ రూపంలో ఆదాయం వచ్చి ఉంటుందని, అలాగే మార్కెట్ లో ధరలు అంతకు రెట్టింపుగానే విక్రయించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. వీటన్నింటికంటే ప్రధానంగా పర్యావరణ నష్టం అనే అంశం వల్ల కూడా భారీగా పెనాల్టీ చెల్లించాల్సి రాక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్విరాన్ మెంట్ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు నిబంధనల ప్రకారం ఆ నష్టం విలువతో పోల్చి దానికి అదనంగా జరిమానా విధించే అవకాశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ విధానమే అమలు చేసినట్టయితే టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక ద్వారా వచ్చిన ఆదాయనికి అదనంగానే పెనాల్టి చెల్లించాల్సి రావడం ఖాయం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాణిజ్య అవసరాలకు డ్రెడ్జింగ్, ఇసుక తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్దమని కూడా ఎన్జీటీ వ్యాఖ్యానించడం గమనార్హం. పబ్లిక్ ట్రస్ట్ సిద్దాంతాన్ని పాటించడంలో విఫలం అయినందు వల్లే గనులు, నీటి పారుదల శాఖలు మధ్యంతర పరిహారం చెల్లించాలని వెల్లడించింది.

ఎన్జీటీ తీర్పు హర్షణీయం…

మానేరు నది నుండి సేకరిస్తున్న ఇసుక సేకరణపై ఎన్జీటీ బెంచ్ ఇచ్చిన తీర్పు హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి అన్నారు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరిగిన ఈ ఇసుక దందా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఇసుక రీచులను వెంటనే మూయించేందుకు చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సమ్మిరెడ్డి అభ్యర్థించారు. అలాగే ఇసుక తవ్వకాలు జరపడమే చట్ట విరుద్దం అయినందున ఇసుక రీచుల కాంట్రాక్టర్లు ఉద్యమకారులపై పెట్టిన కేసులను కూడా క్లోజ్ చేయాలని కోరారు. అక్రమంగా సాగిన ఇసుక రవాణాపై న్యాయ పోరాటం చేసిన మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు సంధి సురేందర్ రెడ్డి, చిటికేశి సతీష్ కుమార్ లను ఈ సందర్భంగా తుమ్మేటి అభినందించారు.

You cannot copy content of this page