దిశ దశ, హైదరాబాద్:
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) మూలాలు ఇంకా దేశాన్ని వీడినట్టుగా లేదు. పీఎఫ్ఐతో అనుభందం పెట్టుకున్న వారి కోసం ఎన్ఐఏ వేట కొనసాగిస్తూనే ఉంది. తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండడంతో ఇక్కడ కూడా పీఎఫ్ఐ లింక్స్ ఇంకా ఉన్నాయని తేటతెల్లం అవుతోంది.
దేశ వ్యాప్తంగా సోదాలు…
ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణాల్లో కూడా పలు చోట్ల సోదాలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ బృందాలు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నాయి. నిజామాజాద్ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చిన పీఎఫ్ఐ కార్యకలాపాలను అధారం చేసుకుని ఆరా తీయగా తెలంగాణాలోని కరీంనగర్, జగిత్యాలలతో పాటు ఏపీలోని పలు చోట్ల కూడా ఉన్నట్టుగా గుర్తించింది. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కూడా పీఎఫ్ఐ కదలికలు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాను విడుదల చేయగా అందులో జగిత్యాలలోని ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీ, నిజామాబాద్ లోని మల్లెపల్లికి చెందిన అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్, ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఖాజానగర్ కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ లతో పాటు కేరళకు చెందిన 11 మంది, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు చొప్పన మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. వీరి ఆచూకి అందించిన వారికి పారితోషికం కూడా ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. దీంతో పీఏఫ్ఐ కార్యకలాపాలు ఇంకా దేశంలో కొనసాగుతున్నట్టుగా స్ఫష్టం అవుతోంది. అయితే పరారీలో ఉన్న ఈ నిందితులు ఎక్కడికెళ్లారన్న విషయంపై ఎన్ఐఏ బృందాలు తెలుసుకునే పనిలో నిమగ్నం అయాయి. పీఎఫ్ఐకి అండదండలు అందిస్తున్న ఇతర దేశాలకు వెళ్లారా లేక దేశంలోనే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారా అన్న వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.