దేశ వ్యాప్తంగా అక్రమార్కుల భరతం పట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దూకింది. అంతర్జాతీయ ఉగ్ర వాద సంస్థల మూలలపై నిఘా వేసి మరీ అణిచివేసే పనిలో నిమగ్నం అయింది. ప్రధాన సంఘటనలు జరిగినప్పుడు దర్యాప్తు చేయడం వాటి వెనక ఉన్న విషయాన్ని దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయడం వంటి చర్యలతో ఎన్ఐఏ తన సత్తా చాటింది. గతంలో ఏనాడు లేని విధంగా సంస్థ దూకుడు ప్రదర్శించిందనే చెప్పాలి.
లాస్ట్ ఈయర్…
ఒక్క గత సంవత్సరంలోనే దేశంలోని వివిధ రాష్ట్రాలలో మొత్తం 73 కేసులు నమోదు చేశామని, 59 చార్జిషీట్లు కూడా దాఖలు చేశామని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం 456 మందిని అరెస్టు చేశామని ప్రకటించిన ఎన్ఐఏ 2021లో 61 కేసులు నమోదు చేయగా గత సంవత్సరం ఈ కేసుల సంఖ్య 19.67 శాతానికి పెరిగిందని ఏజెన్సీ వివరించింది. దేశంలో ప్రధానంగా జమ్మూ కశ్మీర్, అస్సాం, బీహార్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ తదితర టెర్రరిస్టుల కార్యకలాపాలు దాని అనుభంద సంస్థలపై కేసులు నమోదు చేసినట్టు ఎన్ఐఏ పేర్కొంది. ఇందులో జమ్మూ కాశ్మీర్ లో 11, లెఫ్ట్ వింగ్ తీవ్రవాద సంబందిత కేసులు 10, ఈశాన్య రాష్ట్రాల్లో నమోదు చేసినవి 10, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై 7, పంజాబ్‌లో 4, గ్యాంగ్‌స్టర్, టెర్రర్, డ్రగ్స్ స్మగ్లర్ నెక్సస్‌తో సంబంధం ఉన్న వ్యవహారంలో 3, టెర్రర్ ఫండింగ్ ఒకటి, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లకు సంబంధించిన రెండు కేసులు ఉన్నాయని ఎన్ఐఏ వివరించింది. మొత్తం 50 ఛార్జి షీట్లలో 368 మందిపై నేరారోపణకు సంబందించి అభియోగాల వివరాలను కోర్టుకు సమర్పిచామని 456 మంది నిందితులను అరెస్టు చేయగా 19 మంది నిందితులు పరారీలో ఉన్నట్టు వెల్లడించింది. ఇద్దరు నిందితులను బహిష్కరణకు సంబందించిన కేసులో అరెస్ట్ చేయగా, 38 ఎన్ఐఏ కేసుల్లో కోర్టులు తీర్పునిచ్చాయని వివరించింది. మొత్తం 109 మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు ఆరుగురికి జీవిత ఖైదు విధించినట్టు వివరించింది. 2022 లో ఉపా చట్టం కింద ఎనిమిది మంది ఉగ్రవాదులుగా గుర్తించగా వారిపై చర్యలు తీసుకుంటున్నామని కూడా జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది.
పీఎఫ్ఐ సంచలనం…
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ విషయంలోనే ఎన్ఐఏ సంచలనంగా వ్యవహరించింది. కేరళ కేంద్రంగా మూవ్ మెంట్ స్టార్ట్ చేసిన పీఎఫ్ఐ కోచింగ్ సెంటర్ల పేరిట యువతను ఆకర్షిస్తూ వారిని ఉగ్ర కార్యాకలాపాలకు ప్రొత్సహిస్తున్నదన్న అభియోగాలపై క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేశాయి ఎన్ఐఏ బృందాలు. ఆరు టెర్రర్ సంస్థలకు సంబందించిన వారిని అక్కున చేర్చుకుని ఆక్టోపస్ లా దేశం నలుమూలలా వేళ్లూనుకునేందుకు స్కెచ్ వేసిన పీఎఫ్ఐ మూలలపై నిఘా వేసింది. ఆర్థిక సంబంధాలతో పాటు పీఎఫ్ఐ నిర్మాణం తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీసి పకడ్భందీగా చెక్ పెట్టడంలో ఎన్ఐఏ సక్సెస్ అయింది. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐపై అలా నిషేధం విధించిందో లేదో అలా దేశ వ్యాప్తంగా దాడులకు పాల్పడి పీఎఫ్ఐకి సంబందించిన చర్యలను కట్టడి చేసింది. ఈ కేసుకు సంబందించి డిసెంబర్ 29న ఛార్జిషీట్ కూడా వేసిన ఎన్ఐఏ పీఎఫ్ఐపై అభియోగాలు వాటికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించింది. గత సంవత్సరం ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ పీఎఫ్ఐ నేరాలకు సంబందించినదే చివరిది. మొత్తం 11 మందిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ ఇంకా చేపట్టాల్సి ఉందని కూడా అందులో పేర్కొనడం గమనార్హం.
తెలంగాణాతో వెలుగులోకి…
కరోనా సమయంలో కరీంనగర్ లో పీఎఫ్ఐ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ అప్పటి కరీంనగర్ పోలీసులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. కోచింగ్ సెంటర్ పేరిట ఇక్కడి యువతను ఆకర్షించి కేరళకు తీసుకెళ్లి శిక్షణ ఇచ్చే పనిలో నిమగ్నం అయిన విషయం తెలియగానే పోలీసులు నిర్వహాకునికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కఠినంగా వ్యవహరించారు. దీంతో కరీంనగర్ లో పీఎఫ్ఐ కార్యకాలాపాలకు బ్రేకు పడింది. అయితే ఇదే విధానంతో నిజామాబాద్ లో పీఎఫ్ఐ తన కార్యకలాపాలను కొనసాగిస్తూ జగిత్యాల వరకూ చాప కింద నీరులా పట్టు బిగించే పనిలో నిమగ్నం అయింది. ఈ క్రమంలో క్రైం నెంబర్ 141/2022, నిజామాబాద్ 4వ స్టేషన్ లో నమోదయిన కేసు ఆధారం చేసుకున్న ఎన్ఐఏ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. టెర్రర్ ట్రైనింగ్ క్యాంపులు, టెర్రరిస్ట్ రిక్రూట్ మెంట్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని పీఎఫ్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుంది. సెక్షన్ 120 బి, 153(ఎ) ఆఫ్ ఐపీసీ, సెక్షన్స్ 17, 18, 18ఎ, 18బి, యూఏ(పి) యాక్టుపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో పొలిటికల్ పార్టీగా కూడా తన పట్టు నిలుపుకునే ప్రయత్నంలో మునిగిపోయిన క్రమంలో పీఎఫ్ఐ చర్యలకు ఎన్ఐఏ బ్రేకులు వేసింది. దీంతో రానున్న కాలంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో పీఎఫ్ఐ పాకడంతో పాటు ఉగ్ర సంబంధిత కార్యకలాపాలను పెంచి పోషించి దేశంలో కల్లోలం సృష్టించే అవకాశాలు ఉండేవని నిఘా వర్గాలు చెప్తున్నాయి. పీఎఫ్ఐపై దాడులు చేసే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎన్ఐఏ అల్లర్లకు తావివ్వకపోవడం గమనార్హం.