ఖలీస్తాన్ ఉగ్రవాదులపై ఎన్ఐఏ నజర్…

తలలకు వెలలు ప్రకటించిన ఏజెన్సీ

దిశ దశ, న్యూ డిల్లీ:

వేర్పాటు వాద ఉగ్రవాద సంస్థలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపడం ఆరంభించింది. కెనడా ప్రధాని వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య విబేధాలు పొడసూపిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఖలీస్తాన్ వేర్పాటువాదులు పలు సంస్థలను ఏర్పాటు చేసి ఉగ్ర కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. శత్రు దేశాల నుండి డ్రోన్ల ద్వారా మందుగుండు, ఆయుధాలు భారత్ లోకి తరలించి మహారాష్ట్రలోని నాందేడ్ కేంద్రంగా ఖలీస్తాన్ ఉద్యమాన్ని కొనసాగించాలన్న ప్రయత్నాలకు భారత్ నిఘా వర్గాలు ఆదిలోనే చెక్ పెట్టాయి. మరో అమృత్ సర్ గా పేరుగాంచిన నాందేడ్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించినట్టయితే ఖలీస్తాన్ వేర్పాటువాదాన్ని బలంగా నిర్మించవచ్చని అంచనా వేశారు. అయితే వీరి తొలి ప్రయత్నంలోనే నిఘా వర్గాలు అడ్డుకట్ట వేయడంతో ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకుని భారత్ లో ఉగ్రకార్యకలాపాలకు శ్రీకారం చుట్టేపనిలో నిమగ్నం అయినట్టుగా ఇంటలీజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇందులో కెనడా, పాకిస్తాన్ వంటి దేశాలను ఆలంబనగా చేసుకుని భారత్ లో విచ్ఛినకర శక్తులను పెంచిపోషించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్టు తేలింది. ఇటీవల జీ20 సమ్మిట్ లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇదే అంశాన్ని ఊటంకిస్తూ కెనడా ఖలీస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని పెంచి పోషించకూడదన్నారు. అయితే తాజాగా కెనడా ప్రధాని ప్రకటన తరువాత భారత్ ఆ దేశానికి సవాల్ విసురుతూనే ఉగ్రమూకలను కట్టడి చేసే పనిలో పడింది. దీంతో ఖలిస్తానీ వేర్పాటు వాద ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నవారిని లక్ష్యం చేసుకుంది. ఎన్ఐఏ కూడా ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సంస్థకు సంబంధించిన వారిని ఉగ్రవాదులుగా ప్రకటించిన ఏజెన్సీ వారి తలలకు వెలలను కూడా ప్రకటించింది. హర్విందర్ సంధు అలియాస్ రిండా, లఖ్బీర్ సింగ్ సంధు అలియాస్ లాండాలు భారతదేశంలో ఉగ్ర కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారు ఎన్ఐఏ పేర్కొంది. వీరి తలలకు రూ. 10 లక్షల చొప్పున రివార్డులను కూడా ప్రటించింది. అంతేకాకుండా వీరి సహచరులుగా ఉన్న పర్మీందర్ సింగ్ కైరా అలియాస్ పట్టు, సత్నామ్ సింగ్ అలియాస్ సత్బీర్ సింగ్ అలియాస్ సత్తా, యద్విందర్ సింగ్ అలియాస్ యద్దాలకు రూ. 5 లక్షల చొప్పున రివార్డను ప్రకటించింది. ఈ ఐదుగురు ఉగ్రవాదులు ఎన్ఐఏ కేసు నంబర్ RC-21/2023/NIA/DLIలో నిందితులుగా ఉన్నారని, దేశంలో శాంతియుత వాతావరాణాన్ని ఛిన్నాభిన్నం చేస్తూ, మత సామరస్యానికి భంగం కల్గిస్తుండడంతో పాటు పంజాబ్ లో భయాందోళనలను ప్రోత్సహిస్తున్నారని ఏన్ఐఏ పేర్కొంది. మోస్ట్ వాంటెట్ లిస్టులో ఉన్న వీరిపై NIA UA (P) చట్టం, 1967 సెక్షన్లు 17, 18, 18B, 20, 38 & 39లలో కేసులు నమోదయ్యాయని వివరించింది. పాకిస్తాన్ అండదండలతో హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండా పనిచేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈయన పంజాబ్ లోని తరణ్ జిల్లాతో పాటు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా సచ్ ఖండ్, గురుద్వారా హుజూర్ సాహిబ్ గేట్ నంబర్ 5 సమీపంలో నివసిస్తుంటాడని ఎన్ఐఏ పేర్కొంది.

You cannot copy content of this page