ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పై నజర్…

రంగంలోకి దిగిన ఎన్ఐఏ

దిశ దశ, న్యూ ఢిల్లీ:

ఓ వైపున అజ్ఞాత నక్సల్స్ లక్ష్యంగా అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ… మరో వైపున అనుబంధ సంఘాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టుగా స్పష్టం అవుతోంది. ఓ కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందాలు పెద్ద ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
సీపీఐ (మావోయిస్ట్‌) పార్టీ స్కెచ్ వేసిన ముంచింగ్‌పుటు కుట్ర కేసును ఛేదించడంలో భాగంగా NIA స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో జరిపిన దాడుల్లో ఒకరిని అరెస్టు చేసి ఆయుధాలు, నగదుతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 62 ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన NIA టీమ్స్ ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్ర నరసింహులును అరెస్టు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సత్య సాయి జిల్లాలో నరసింహులును అరెస్ట్ చేసినప్పుడు 14 రౌండ్లతో పాటు ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. కడప జిల్లాలోని మరో చోట ప్రాంగణంలో 13 లక్షల నగదు, ఇతర ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో మావోయిస్టు పార్టీ సాహిత్యం ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ దాడులు ఏపీలోని గుంటూరు, పల్నాడు, విజయవాడ, రాజమండ్రి, ప్రకాశం, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరి బీఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలుతో పాటు మొత్తం 53 ప్రాంతాల్లో చేశాయి. తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్, హనుమకొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 9 చోట్ల సోదాలు జరిపారు.

ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఇవే…

CPI (మావోయిస్ట్) సంస్థ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పని చేస్తున్నట్టుగా NIA గుర్తించింది. పౌర హక్కుల కమిటీ (CLC), అమరుల బంధు మిత్రుల సంఘం (ABMS), చైతన్య మహిళా సంఘం (CMS), కుల నిర్మూలన పోరాట సమతి (KNPS), పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM), ప్రగతిశీల కార్మిక సమాఖ్య (PKS), ప్రజా కళా మండలి (PKM), రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ (RWA) లేదా విప్లవ రచయితలసంఘం (VIRASAM), హ్యూమన్ రైట్స్ ఫోరమ్ (HRF), రాజకీయ ఖైదీల విడుదల కోసం కమిటీ (CRPP) మరియు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (IAPL)లు ఏర్పడినట్టుగా ఎన్ఐఏ చెప్తోంది. 2009లో ఉగ్రవాద సంస్థల జాబితాలోకి CPI (మావోయిస్ట్) పార్టీని కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఆయా ఫ్రంటల్ సంస్థల పేరిట ప్రతినిధులు మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారని తమ దర్యాప్తులో తేలిందని NIA చెప్తోంది. ఏపీ, తెలంగాణలో దాడులు చేసిన ప్రాంతాలు కూడా మావోయిస్టు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తున్నవారేనని ప్రకటించింది.

ముంచింగ్ పుట్ కుట్రతో…

మంచింగ్‌పుట్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు మరియు మావోయిస్టు సాహిత్యం రవాణాకు సంబంధించిన జి సమాచారం ఆధారంగా 2020 నవంబర్ 23న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగ్‌పుటు పోలీసుల నమోదు చేసిన ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు. అరెస్ట్ చేసిన పాంగి నాగన్న వద్ద మావోయిస్టులకు అందించేందుకు విప్లవ సాహిత్య పుస్తకాలు, మందులు, రెడ్ కలర్ బ్యానర్ క్లాత్, ఎలక్ట్రికల్ వైర్ బండిల్స్, నిప్పో బ్యాటరీలు, కరపత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అరెస్ట్ చేసిన పాంగి నాగన్నను విచారించడంతో ఆయనకు మావోయిస్టు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు అందజేశారని NIA విచారణలో తేలింది. 2021 మే 21న విజయవాడలోని ప్రత్యేక కోర్టులో ఏడుగురు నిందితులపై ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఏడుగురు వ్యక్తులలో ABMS, CMS, PKS, PDM, PKMలలో పని చేస్తున్న ఐదుగురు ఉన్నారని ఛార్జ్ షీట్ లో వెల్లడించింది. సోమవారం తెలుగు రాష్ట్రాలలో జరిపిన సోదాలతో మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల ఉనికి బయటపడింది. ఇక నుండి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కార్యకలాపాలు కట్టడి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి

You cannot copy content of this page