నిన్నటి వరకు పీఎఫ్ఐ… ఇక మావోయిస్టు పార్టీ

జాతీయ దర్యాప్తు సంస్థ కొత్త పంథాను ఎంచుకుంది… ఇప్పటి వరకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర ఉగ్రవాద సంస్థల కదలికలే టార్గెట్ గా ముందుకు సాగిన ఎన్ఐఏ ఇప్పుడు మావోయిస్టు పార్టీ నాయకులే లక్ష్యంగా పావులు కదపడం ఆరంభించింది. వివిధ రాష్ట్రాల్లో వేళ్లూనుకున్న మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పారా మిలటరీ బలగాలతో పాటు ఆయా రాష్ట్రాలు కూడా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రత్యేకంగా విభాగాలను తయారు చేసుకున్నాయి. తాజాగా నక్సల్స్ అణిచివేతపై ఎన్ఐఏ కూడా ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. దేశంలో విప్లవ సంస్థల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతామని 2024 వరకు అంతర్గతంగా ఏర్పడిన ఈ సంస్థలను అంతమొందించాలని నిర్ణయించుకున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలోనే ఎన్ఐఏ ఎంట్రీ ఇచ్చి తమ హిట్ లిస్ట్ లో ఉన్న మావోయిస్టు నేతలను పట్టివ్వాలంటూ వాల్ పోస్టర్లను అంటించారు. ఇందుకు తగిన పారితోషికం కూడా ఇస్తామని కూడా అందులో పేర్కొన్నారు. ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలోని రద్దీ ప్రాంతాల్లో ఈ వాల్ పోస్టర్లను అతికించారు. ఎన్ఐఏ మెస్ట్ వాంటెడ్ గా ప్రకటించిన ముగ్గురు నక్సల్స్ నేతలు కూడ తెలుగు వారే కావడం గమనార్హం.

ఇదే కారణం…

జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసిన వాల్ పోస్టర్లలో మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించిన నలుగురు మావోయిస్టులు బీఎస్ఎఫ్ జవాన్ల హత్యకు కారకులుగా ఉన్నారని ఎన్ఐఏ పేర్కొంది. ఓ అధికారి సహా మరో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్ల హత్యకు కారకులని, వీరిని పట్టించినట్టయితే రూ. 3 నుండి 10 లక్షల వరకు నజరానా ఇస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నంబర్ ఆర్ సి- 02/2012/NIA/DLI ప్రకారం కేసు నమోదు అయిందని వాల్ పోస్టర్లలో వివరించింది. ఎన్ఐఏ వాంటెడ్ లిస్టులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్, ఆంధ్రప్రదేశ్‌లోని దబ్బపాలెం గ్రామానికి చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్ రైనో, బాతుపురా గ్రామానికి చెందిన మెట్టూరు జోగారావు అలియాస్ బాబు, ఒడిషాలోని కడగుమ గ్రామానికి చెందిన ఖిల్లోరంజు అలియాస్ చంటిలను పట్టిస్తే బహుమతి ఇస్తామని వెల్లడించింది. ఇటీవల రెడ్ కారిడార్ ఏరియాలో ఎన్ఐఏ బృందాలు ప్రత్యేకంగా పర్యటించి మావోయిస్టులకు సంబందించిన వాల్ పోస్టర్లను విడుదల చేయడం గమనార్హం.

పాత కేసులు…

అయితే దేశంలోని పలు రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ పట్టు సాధించిన క్రమంలో వీరిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గతంలోనే కేసులు నమోదు చేసినట్టు స్పష్టం అవుతోంది. పాత కేసులను తిరగదోడి అందుకు బాధ్యులైన వారిని లక్షం చేసుకుని ఏరివేతవైపు సాగుతున్నట్టుగా అర్థం అవుతున్నది. ఒక్కో కేసుకు సంబందించిన ఫైళ్లను పరిశీలించి అందులోని వివరాలకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ నేతలను ఏరివేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్ర బలగాలు కూడా ఆయా రాష్ట్రాల్లోని ప్రాబల్య ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మావోయిస్టులు దాడుల్లో చనిపోయిన కేంద్ర బలగాలను కోల్పోయిన ఘటనలు, జాతీయ అంశాలతో ముడిపడ్డ వ్యవహారలకు సంబందించిన కేసులు నమోదు చేసి ఎన్ఐఏ ఏరివేవేతలో నిమగ్నం అయినట్టు స్పష్టం అవుతోంది. ఏది ఏమైనా జాతీయ దర్యాప్తు సంస్థ సీరియస్ గా తన దృష్టిని మావోయిస్టలపై సారించడం చర్చకు దారి తీస్తోంది.

You cannot copy content of this page