నీల్సో ఆడియోలు విడుదల చేసిన నక్సల్స్…
దిశ దశ, దండకారణ్యం:
క్రాంతికారి జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్న మావోయిస్టులకు కోవర్టు రూపంలో అంతర్గత శత్రువులు తయారైనట్టుగా స్పష్టం అవుతోంది. కీకారణ్యాల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా పట్టు నిలుపుకున్న మావోయిస్టులు ఇప్పుడు కోవర్టులను ఏరివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా బంటి రాధ అలియాస్ నీల్సోను చంపిన తరువాత మావోయిస్టులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నీల్సో అందించిన వివరాలకు సంబంధించిన ఆడియోలు కొన్నింటిని మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. కేంద్ర కమిటీలో మీడియా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రాధతో పాటు మరో 10 మందిని కోవర్టులకు పాల్పడుతున్నారని గుర్తించారు. అందరినీ బటయకు పంపించినప్పటికీ కేవలం రాధను మాత్రమే చంపేశారు. దీంతో వివిధ వర్గాలు రాధను హత్య చేసిన తీరుపై, దళిత యువతిని ఇలా చంపడం ఏంటన్న విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ మురళిధర్ పేరును ఊటంకిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మాజీలను ఇంటర్వ్యూ చేస్తూ నీల్సో విషయంలో మావోయిస్టులు తప్పు చేశారన్న రీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని మావోయిస్టు పార్టీ ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ విడుదల చేసిన ప్రటనలో వ్యాఖ్యానించారు. నీల్సో చెప్పిన విషయాలకు సంబంధించిన కొంతమేర ఆడియో మాత్రమే బహిర్గతం చేస్తున్నామని, పూర్తి ఆడియోను విడుదల చేయడం లేదని గణేష్ వివరించారు. పూర్తి ఆడియోను విడుదల చేసినట్టయితే తమ శత్రువు రహస్య పథకాన్ని బహిర్గతం చేసినట్టు అవుతుందని భావించామని గణేష్ వివరించారు. జర్నలిస్ట్ మురళీధర్ సిద్దంగా ఉన్నట్టయితే తాము ఆహ్వానిస్తున్నామని నీల్సోకు సంబంధించిన ఆధారాలను చూపిస్తామని కూడా ఆయన స్ఫష్టం చేశారు. ఆయన విప్లవ ద్రోహులను మాత్రమే ఎంపిక చేసుకుని ఇంటర్వ్యూలు చేస్తున్నారన్న విషయంపై గతంలో కూడా మావోయిస్టు పార్టీ లేఖ రాసిందని, తాజాగా నీల్సో విషయంలోనూ ఇదే వైఖరితో ఇంటర్వ్యూలు చేయడంతో వాస్తవాలు వివరించాల్సి వచ్చిందని గణేష్ వెల్లడించారు.
ఆ బలహీనతే కారణమా..?
నీల్సో అలియాస్ రాధ మరణానికి ముందు పార్టీ ఆమె నుండి రాబట్టిన విషయాలను రికార్డు చేసింది. ఈ ఆడియోల్లో ఉన్న అంశాలను బట్టి నీల్సో కుటుంబ సభ్యులే లక్ష్యం చేసుకుని కీకారణ్యంలో ఉన్న రాధను ట్రాప్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది. తన తమ్ముడు, నాన్న, అమ్మతో పాటు మరో స్నేహితురాలికి సంబంధించిన ఫోటోలను నీల్సో వాట్సప్ కు షేర్ చేయడంతో మొదలైనట్టుగా స్పష్టం అవుతోంది. ఇందులో ముఖ్యంగా తన తమ్ముడిని చంపుతామని హెచ్చరికలు చేశారని, ఇదే సమయంలో తాను కూడా హతం అయ్యే పరిస్థితి ఉందని రాధ తమ్ముడు కూడా ఆడియో రికార్డు చేసి పంపించారని వివరించారు. అంతేకాకుండా పాండు పేరిట ఒకటి రెండు సార్లు ఫోన్లు వచ్చాయని, మహిళలపై జరుగుతున్న అరాచకాలపై తాను పలు వేదికల్లో ఇచ్చిన ఉపన్యాసలను విన్నానని చెప్పి తనతో టచ్ లోకి వచ్చారని నీల్సో మావోయిస్టు నాయకత్వానికి వివరించింది. పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ఇలా చాలా సార్లు తనకు కాంటాక్ట్ లోకి వచ్చారన్నారు. ఆడియో క్లిప్పింగులు పంపిస్తూ తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిళ్లు చేశారని నీల్సో వివరించారు. అయితే తన తమ్ముడు, నాన్న, అమ్మ, తన స్నేహితురాల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్న రీతిలో తనకు హెచ్చరికలు పంపించారని రాధ వివరించారు. తాను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నానో వారి ప్రాణాలకు గ్యారెంటీ ఉండవన్న రీతిలో చెప్పుకొచ్చారని రాధ వివరించింది. ఇంటర్నెట్ సెంటర్ కు, ఇతరాత్ర పనుల్లో కూడా రాధను మావోయిస్టు పార్టీ విశ్వసించిందన్న విషయాన్ని గుర్తించే ట్రాప్ చేశారన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రజా సంఘాలకు చెందిన వారు ఎవరెవరు వస్తున్నారు..? వారు ఎక్కడెక్కడ కలుస్తాంటారు అన్న విషయాలపై కూడా ఆరా తీశారని అయితే అలాంటి వివరాలు తనకు తెలియని, తన స్థాయి అంత కాదని వారికి వివరించానన్నారు. అంతేకాకుండా నువ్వేం చేస్తున్నావు ఎలా ఉన్నావు అన్న వివరాలు తనకు తెలుసని అవతలి వ్యక్తి చెప్పినప్పుడు అన్ని తెలిసి కూడా తనను ఎందుకు అడుగుతున్నావని ప్రశ్నించినట్టుగా కూడా వివరించారు. తమ్ముడి ద్వార పంపించిన మెసేజ్ లో ఆమెలో అప్యాయతను, అనురాగాలు గుర్తుకు వచ్చేవిధంగా కూడా వ్యవహరించారని రాధ చెప్పిన ఆడియోలో ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే మాత్రం మావోయిస్టు పార్టీకి తీరని నష్టాన్ని చవి చూసే విధంగా కోవర్టులుగా మారేందుకు పార్టీకి చెందిన వారు సాహసించారని, అందులో రాధ కూడా ఒకరని ఏఓబి కార్యదర్శి గణేష్ పంపించిన ఆడియోలను బట్టి స్పష్టం అవుతోంది.