దద్దరిల్లిపోతున్న నాంపల్లి బీజేపీ ఆఫీసు

నిజామాబాద్ శ్రేణుల ఆందోళన

మండల కమిటీల మార్పుతో రచ్చ

దిశ దశ, హైదరాబాద్:

ఓ వైపున వాతావరణం చల్లబడిపోతే… రాష్ట్ర బీజేపీ కార్యాలయం మాత్రం పార్టీ శ్రేణుల నిరసనలతో హోరెత్తుతోంది. బుధవారం నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బీజేపీ శ్రేణులు నాంపల్లి స్టేట్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం జిల్లాలోని పలు కొన్ని మండలాల కమిటీలను మార్చినందుకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. ఎంపీ అరవింద్ డౌన్ డౌన్, వి వాంట్ జస్టిస్ అంటూ ఇస్తున్న నినాదాలతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం దద్దరిలిపోతోంది. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ నాయకులను వారించిన ప్రకాష్ రెడ్డితో వాగ్వాదానికి దిగిన నిజామాబాద్ జిల్లా బీజేపీ శ్రేణులు. ఈ క్రమంలో ప్రకాష్ రెడ్డి, అరవింద్ వ్యతిరేక వర్గం నెట్టుకునే వరకు చేరడంతో పాటు రాష్ట్ర నేతలపై తిరగబడడం సంచలనంగా మారింది. జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాలకు చెందిన వందలాది మంది బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుండి కదిలేది లేదంటూ నిజామాబాద్ జిల్లా బీజేపీ క్యాడర్ స్పష్టం చేస్తోంది. వారిని బుజ్జగించేందుకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులు వారి వద్దకు చేరుకున్నప్పటికీ వారు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నిజామాబాద్ లోకసభ పరిధిలోని కమిటీలను మార్చిన వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ అరవింద్ ప్రకటించారు. సంస్థగత మార్పుల్లో భాగంగానే జిల్లా పార్టీ అధ్యక్షుడే 13 మండల కమిటీలను మార్చారని వివరిస్తున్నారు.

You cannot copy content of this page