పసుపు ‘బోర్డు’ మాత్రమేనా..?

రైతుల వెరైటీ నిరసనలు

ఇందూరు ఎంపీకి నిరసన సెగ

దిశ దశ, నిజామాబాద్:

నిజామాబాద్ రైతాంగం కోసం ప్రత్యేకంగా పసుపు బోర్డు తీసుకొస్తానని మాట ఇచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్ లక్ష్యంగా సరికొత్త నిరసనలకు శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ జిల్లాలోని పసుపు రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సకాలంలో మార్కెటింగ్ అయ్యే విధంగా బోర్డు ఏర్పాటు చేస్తానని గత లోకసభ ఎన్నికలకు ముందు అరవింద్ బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. తాను గెలిచిన వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఇక్కడ అత్యంత బలమైన ప్రత్యర్థిగా బరిలో నిలిచిన కల్వకుంట్ల కవితపై పైచేయిగా నిలవాలని గ్రౌండ్ వర్క్ చేసిన అరవింద్ పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆచరణలోకి రాని హామీలు ఇచ్చారంటూ ఇప్పటికే ఇతర పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోల్స్ చేసి మరీ అరవింద్ ప్రామిస్ మిస్ చేశారంటూ సెటైర్లు వేశారు. అయితే తాజాగా ఇది మా ఎంపీ గారు తెచ్చిన బోర్డు అని రాసిన పసుపు రంగు బోర్డులను నిజామాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. పసుపు రైతుల పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రచారం తీరు నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ కేంద్ర దృష్టిలో లేదని ప్రకటించారు. దీంతో పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ బోర్డులు ఏర్పాటు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

You cannot copy content of this page