నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ప్రచారం అంతా అబద్దం, ఈ వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నానని ప్రముఖ సింగర్ మంగ్లి స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్లో ఓ పోస్ట్ కూడా చేశారు. శనివారం కర్ణాటకలో జరిగిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందని, తాను చేసిన అత్యుత్తమ ఈవెంట్లలో బళ్లారి కార్యక్రమం ఒకటిగా నిలుస్తుందని మంగ్లీ వెల్లడించారు. కన్నడ ప్రజలు నాపై చూపించిన ప్రేమ అభిమానం మద్దతు అనిర్వచనీయమైనదని, మాటల్లో వర్ణంచలేనంతగా అక్కడి అధికారులు తనను చూసుకున్నారని మంగ్లీ ప్రకటించారు. నా ప్రతిష్టను కించపర్చడానికి చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానని సింగర్ మంగ్లీ వ్యాఖ్యానించారు. అభిమానులు కనబరుస్తున్న ప్రేమకు అన్ని వేళలా రుణపడి ఉంటానని కూడా అన్నారు.
ప్రచారం చేసిందెవరో…?
కర్నాటకలో సింగర్ మంగ్లీ హాజరైన కార్యక్రమంలో స్థానికులు కన్నడ భాషలో మాట్లాడాలని కోరారని అయితే కొద్దిసేపు మాట్లాడిన మంగ్లి ఆ తరువాత తెలుగులోనే తన ప్రసంగాన్ని కొనసాగించారని ప్రచారం జరిగింది. దీంతో ఆగ్రహించిన స్థానిక యువత వేదికపై నుండి టెంట్ లోకి వెళ్లగానే ఆమె వద్దకు వెల్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారని, తిరుగు ప్రయాణం అవుతుండగా కారుకు అడ్డంగా వెల్లిన స్థానిక యువతను పోలీసులు నిలువరించారని నెట్టింట వైరల్ అయింది. అంతేకాకుండా ఆ యువకులు ఏకంగా ఆమె కారుపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయని కూడా ప్రచారం చేశారు. ఆదివారం మద్యాహ్నం నుండి ఈ ప్రచాచం ఊపందుకవడానికి తోడు ఫ్రంట్ మిర్రర్ అద్దాలు పగిలిని కారు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సింగర్ మంగ్లీ స్వయంగా తనపై ఎలాంటి దాడి జరగలేదని చెప్పుకోవల్సి వచ్చింది.