వీగిపోయిన అవిశ్వాసం… కాంగ్రెస్ ఖాతాలో మరో మండలం..?

దిశ దశ, మహదేవపూర్:

మహదేవపూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు బన్సోడ రాణీబాయిపై అధికార పార్టీ సభ్యులు వేసిన అవిశ్వాస తీర్మాణం వీగిపోయింది. దీంతో పదవి కాలం పూర్తయ్యే వరకూ ఆమె ఎంపీపీగా కొనసాగనున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న విబేధాలు కాస్తా అవిశ్వాసం వరకు చేరింది. దీంతో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అవిశ్వాసం ప్రకటిస్తున్నట్టుగా పేర్కొంటూ అధికారులకు దరఖాస్తు ఇచ్చారు. బుధవారం ఎంపీపీ అవిశ్వాస తీర్మాణం కోసం సమావేశం ఏర్పాటు చేయగా కోరం సభ్యులు ఎవరూ మీటింగ్ కు హాజరు కాలేదు. దీంతో సిట్టింగ్ ఎంపీపీ రాణిబాయిపై పెట్టిన అవిశ్వాస తీర్మాణం వీగిపోయిందని భూపాలపల్లి ఆర్డీఓ రమాదేవి ప్రకటించారు.

రాష్ట్రంలోనే మొదటిది…

రాష్ట్రంలోని పలు మండలాల్లో అవిశ్వాసం ప్రకటించినప్పటికీ ఇందుకు సంబంధించిన ప్రక్రియను అధికారులు హోల్డ్ లో ఉంచారు. దీంతో అధికార పార్టీ చెందిన ముఖ్య నాయకులు రంగంలోకి దిగి అవిశ్వాసం ప్రకటిస్తూ ఇచ్చిన లేఖలపై స్పందిచకుండా సైలెంట్ గా ఉండాలని నాయకులు సభ్యులకు సూచించారు. ఒక్క హుజురాబాద్ ఎంపీపీ విషయంలో మాత్రం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అవిశ్వాస ప్రకటిస్తూ ఇచ్చిన లేఖను కూడా తిరిగి తీసుకుంటున్నామని ఎంపీటీసీ సభ్యులతో చెప్పించారు. ఈ మేరకు ఆర్డీఓకు కూడా లేఖ ఇవ్వడంతో హుజురాబాద్ అవిశ్వాస రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. కానీ మహదేవపూర్ విషయంలో మాత్రం అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేసే వరకూ చేరింది. బహుష రాష్ట్రంలోనే అవిశ్వాసం కోసం సమావేశం ఏర్పాటు చేసిన చరిత్ర ఒక్క మహదేవపూర్ కే దక్కిందని చెప్పాలి. మిగతా చోట్ల మాత్రం నాయకులు చొరవ తీసుకుని ఎక్కడి వారిని అక్కడ బుజ్జగించగా మహదేవపూర్ ఎంపీపీ రాణీబాయిని గద్దె దించాలని అసమ్మతి వర్గం చేసిన ప్రయత్నాలు చివరి రెండు రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ మద్దతుతో అవిశ్వాసం నెగ్గుతామన్న ధీమాతో ఉన్న అధికార పార్టీ నాయకులకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శిబిరం ఝలక్ ఇచ్చింది. వారికి అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీని అనూహ్యంగా తన శ్రీధర్ బాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలోకి తరలించారు. క్యాంపుల ఏర్పాటు చేసి మంత్రాంగాలు నెరిపినా చివరి క్షణంలో శ్రీధర్ బాబు వేసిన స్టెప్ తో అంతా ఉల్టాపల్టా అయిపోయింది.


కాంగ్రెస్ ఖాతాలో మరోకటి..

మహదేవపూర్ ఎంపీపీ అవిశ్వాసంలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో మరో ఎంపీపీని వేసుకుంది. ఇప్పటి వరకు నాలుగు మండలాల్లో కాంగ్రెస్ ఎంపీపీలు ఉండగా, అవిశ్వాస ప్రకటనతో రాణీబాయి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖయమైంది. అధికార పార్టీలో ఉండి ఎంపీపీ అయినప్పటికీ తనను ఎన్నోరకాలుగా ఇబ్బంది పెట్టడం, చివరకు తనను ఎంపీపీ పదవి నుండి తప్పించే ప్రయత్నం చేయడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అవిశ్వాసం విషయంలో తన వ్యతిరేకుల ఎత్తులు ఫలించకపోవడంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిన నేపథ్యంలో రాణిబాయి గులాభి జెండాకు సలాం కొట్టి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. విశ్వాస పరీక్ష వీగిపోయిన కొద్దిసేపట్లోనే మహదేవపూర్ లోని మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు విగ్రహానికి నివాళులు అర్పించడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని స్పష్టం అయింది.

You cannot copy content of this page