మంథనిలో అసమ్మతి సెగ…
ఎంపీపీల ఉద్వాసనకు రంగం సిద్దం
విశ్వాస పరీక్షలపై హాట్ టాపిక్
దిశ దశ, మంథని:
అక్కడ అధికార పక్షంలో అసమ్మతి రాజ్యమేలుతోంది… స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల రూపంలో అక్కసు బయట పడుతోంది. సొంత పార్టీ ఎంపీపీలపై ఎంపీటీసీలు అవిశ్వాస నోటీసులు ఇస్తుండడంతో నియోజకవర్గం అంతా హాట్ టాపిక్ గా మారింది. ప్రతి పక్ష పార్టీల చేతిలో ఉన్న మండలాల్లో ప్రశాంత వాతావరణం ఉండగా అధికార పక్షం చేతిలో ఉన్న మండలాల్లో మాత్రం విశ్వాస పరీక్షల తంతు నడుస్తోంది.
మంథని పరిస్థితి ఇది…
పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజక వర్గంలో వైవిద్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకుల మధ్య నెలకొన్న విబేధాలు ఇప్పుడు రచ్చకెక్కిన పరిస్థితి తయారైంది. నియోజకవర్గంలోని 9 మండలాల్లో ఐదు బీఆర్ఎస్, నాలుగు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఇందులో అధికార పార్టీ చేతిలోని నాలుగు మండలాల్లో కూడా అవిశ్వాస తీర్మానం కోసం నోటీసులు ఇవ్వడం గమనార్హం. కమాన్ పూర్, రామగిరి, మంథని, మహాదేవపూర్ మండలాల్లోని ఎంపీపీలను గద్దె దింపేందుకు ఇప్పటికే ఎంపీటీసీ సభ్యులు సంబంధిత అధికారులు అవిశ్వాసం ప్రకటిస్తూ లేఖలు ఇచ్చారు. మహదేవపూర్ ఎంపీపీపై అవిశ్వాస సమావేశం ఆగస్టు 2న నిర్వహించేందుకు అధికారులు లేఖలు కూడా పంపించారు. మిగతా మండలాల్లో కూడా నేడో రేపో అవిశ్వాస సమావేశాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.
ప్రశాంతంగా ప్రతిపక్షం…
మంథని అధికార పార్టీ ప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న మండలాల్లో అవిశ్వాసాలు… క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రశాంతత నెలకొంది. కాంగ్రెస్ చేతిలో ఉన్న మండలాల్లో అవిశ్వాసాలకు తావివ్వకుండా అక్కడి పావులు కదుపుతున్నారు. దీంతో మంథని నియోజకవర్గంలో వైవిద్యమైన పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పాలి. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రాతినిథ్యం వహిస్తున్న మండలాల్లో పావులు కదిపి ఆదిపత్యం చెలాయించే పరిస్థితికి భిన్నమైన వాతావరణం అధికార పార్టీలో నెలకొనడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల వేళ…
మరో రెండు మూడు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొననున్న నేపథ్యంలో మంథని అధికార పక్షంలో అసమ్మతి రాజుకుంటుండడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పావులు కదుపుతుంటే అవిశ్వాసపు రాజకీయాలు తెరపైకి రావడం కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదు. అయితే అవిశ్వాసాల ఎత్తులపై ముఖ్య నాయకులు జోక్యం చేసుకుని చక్కదిద్దనట్టయితే సిట్టింగ్ ఎంపీపీలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం. విశ్వాస పరీక్షకు ముందే తమ పదవులకు రాజీనామా చేసినట్టయితే అవిశ్వాస ఎత్తులకు చెక్ పెట్టినట్టవుతుందని ఎంపీపీలు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా మంథని అధికార పార్టీలో అవిశ్వాసాల ముసలం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.