ఒక్క రోజు కోసం అవిశ్వాసం… కరీంనగర్ లో నయా పాలిటిక్స్…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ బల్దియా కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు అన్ని ఇన్ని కావు. మేయర్ సునీల్ రావు రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే సునీల్ రావుపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆదివారం BRS కార్పోరేటర్లందరితో అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన దరఖాస్తుపై సంతకాలు చేయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 35 మంది కార్పోరేటర్లు ముందుకు రాగా ఇతర పార్టీల వారిని కూడా తమతో కలుపుకుని ముందుకు సాగాలని భావిస్తున్నట్టుగా సమాచారం. మరికొద్ది సేపట్లో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి అవిశ్వాసానికి సంబంధించిన దరఖాస్తును అందించనునున్నట్టుగా తెలుస్తోంది.

ఒక్క రోజు కోసం…

పార్టీని వీడిన మేయర్ సునీల్ రావు, ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న కార్పోరేటర్లు అందరి పదవి కాలం కూడా మంగళవారం నాటితో ముగినుంది. దీంతో 24 గంటల్లో పదవి కాలం ముగసిపోయే పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని దరఖాస్తు చేసి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రయోజనాలు పొందాలని ఆశిస్తుందో అంతుచిక్కకుండా పోయింది. దీనివల్ల ప్రజల్లో చర్చకు తీసుకరావడం తప్ప అవిశ్వాసం కోసం చేసిన దరఖాస్తుపై కలెక్టర్ స్పందించి ఉత్తర ప్రత్యుత్తారలు చేసే లోపలే వారంతా మాజీలు అవుతారన్నది వాస్తవం. ఇలాటి పరిస్థితుల్లో అవిశ్వాసం అంశాన్ని తెరపైకి తీసుకవచ్చి అనుకూలంగా ఎలా మల్చుకుంటారన్నది బీఆర్ఎస్ నాయకులకే తెలియాలి.

ఇటు సంతకం… అటు ఫోన్లు…

గంటల వ్యవదిలో ముగిసిపోయే పదవి కాలానికి అవిశ్వాసం కోసం తయారు చేసిన దరఖాస్తుపై సంతకాలు చేసిన కొంతమంది కార్పోరేట్లు తామెందుకు టార్గెట్ కావాలని భావించారో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ బీఆర్ఎస్ నాయకత్వం చెప్పిన చోట సంతకాలు చేసిన వెంటనే మేయర్ సునీల్ రావుకు ఫోన్ చేసి మరీ సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. 24 గంటల వ్యవధిలో కంప్లీట్ కానున్న పదవి కాలానికి విశ్వస పరీక్ష పెట్టడం అనేది BRS పార్టీకి చెందిన కొంతమంది కార్పోరేటర్లకు, నాయకులకు కూడా ఇష్టం లేదన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనివల్ల ప్రజల్లో అభాసుపాలు కావడం తప్ప పార్టీకి లాభం చేకూరే అవకాశం ఏ మాత్రం ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు.

టిట్ ఫర్ టాట్…

ఇకపోతే మేయర్ సునీల్ రావు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం పాలక వర్గ పదవి కాలం ముగుస్తుండడంతో ఏజెండా రహిత సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 5 ఏళ్ల పదవి కాలం ముగిసిన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులందరికి సన్మానం చేసే కార్యక్రమంతో సరిపెట్టాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కమిషనర్ తో కూడా చర్చించిన మేయర్ సునీల్ రావు చివరి రోజున తన ప్రత్యర్థులు గొడవలు చేసేందుకు ఆస్కారం ఇవ్వకుండా పావులు కదుపుతున్నట్టుగా సమాచారం.

You cannot copy content of this page