ఈడీ… సీబీఐ కేసులున్న నేతలకు నో ఎంట్రీ

కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి

దిశ దశ, కరీంనగర్:

ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న వారిని బీజీపీలోకి చేర్పించుకునే ప్రస్తక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ లో ఇష్టాగోష్టిలో మాట్లాడిన ఆయన పలు విషయాలపై స్పష్టత ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా వ్యవహరిస్తున్నామన్నారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థల విచారణకు బీజేపీకి సంబంధం లేదన్నారు. ఇతర పార్టీల నుండి గెలిచి బీజేపీలో చేరుతామన్న వారు ఖచ్చితంగా తమ పదవికి రాజీనామా చేయాల్సిందేనని వెల్లడించారు. తిరిగి వారు ప్రజాక్షేత్రంలోకి వెల్లి గెలవాల్సిందేనని, బీజేపీలో చేరి తిరిగి ఎన్నికల్లోకి వెల్లిన వారు గెలిచి తీరుతారన్నారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు ఈ విధానం పాటించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షుని మార్పు అంశం హై కమాండ్ చూసుకుంటుందని, పార్టీలో కొత్తగా చేరిన వారికి కీలక బాధ్యతలు అప్పగించవద్దన్న నిబంధన ఏమీ లేదని అన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరుగా పరిస్థితులు ఉంటాయని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు బండి సంజయ్. విభజన చట్టంలోని వివిధ అంశాలపై గత కేసీఆర్ ప్రభుత్వం పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నా రాజకీయ లబ్ది కోసం మరింత జఠిలం చేసి సమస్యను నాన్చుతూ వచ్చారని విమర్శించారు. ఇప్పుడా అవసరం లేదని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉన్నారన్నారు. చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యల పరిష్కారం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నారు. గోతికాడ నక్కలా సీఎంల భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా? అని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి అవకాశం ఇవ్వద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రి సూచించారు. రామాయణ్ సర్క్యూట్ కింద ఇల్లందకుంట, కొండగట్టు అలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని, ఇందుకోసం నేను ప్రత్యేక చొరవ తీసుకుంటానని బండి సంజయ్ వెల్లడించారు. వేములాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతామి, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరినా కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరించి కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదన్నారు.
కరీంనగర్ -హాసన్ పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తయిందని, రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలోనే రైల్వేలేన్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అడిగితే స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించలేదని, రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి వచ్చిన విజ్ఝప్తుల మేరకే కేంద్రం గడువు పొడిగించిందని తెలిపారు. గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్ కు మరిన్ని నిధులు వచ్చే అవకాశముందని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని బండి సంజయ్ ప్రకటించారు.

You cannot copy content of this page