వేరుగానే ఉంచండి… విలీనం చేయకండి…

పంచాయితీల అభ్యర్థన

దిశ దశ, కరీంనగర్:

వ్యవసాయంపై ఆధారపడి జీవించే గ్రామాలను కూడా బల్దియాలో విలీనం చేసి తమను బలి చేయవద్దని వేడుకుంటున్నారు ఆయా గ్రామాల ప్రజలు. కార్పోరేషన్ లో విలీనం చేయడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. తాజాగా కరీంనగర్ కార్పోరేషన్ లో కొత్తపల్లి మునిసిపాలిటీతో పాటు పలు గ్రామాలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శేడు, గోపాలపూర్ గ్రామాలకు చెందిన రైతులు విలీన గ్రామాల ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వినతి పత్రం పంపించిన ఆయా గ్రామాల ప్రజలు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు మంద రాజమల్లు మాట్లాడుతూ… వ్యవసాయ ఆధారిత గ్రామలైన దుర్షేడ్, గోపాలపూర్ గ్రామాలను కరీంనగర్ కార్పోరేషన్ లో విలీనం చేయడం వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న, మద్య తరగతులకు చెందిన వారే ఈ గ్రామాల్లో నివసిస్తున్నారని పెద్ద ఎత్తున పన్నులు చెల్లించే పరిస్థితిలో కూడా లేమన్న విషయాన్ని గమనించి ఈ రెండు గ్రామాల విలీన ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. నేటికీ కూడా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని, వ్యవసాయ కూలీలుగా ఉపాధి పొందుతున్న నిరుపేదలు కూడా ఉన్నారని, దీనివల్ల ఉపాధి హామీ పథకంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు నేటికి ఉన్నాయన్నారు. తమ గ్రామాలను బల్దియాలో విలీనం చేసినట్టయితే ఉపాధి హామీ పథకం అమలు కాకపోవడం వల్ల చాలా కుటుంబాలు ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే కరీంనగర్ కార్పోరేషన్ లో విలీనం చేసిన గ్రామాల్లోనే మౌళిక వసతులు కల్పించలేకపోయారని కొత్తగా తమ గ్రామాలను కూడా చేర్చడం వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో దుర్షేడ్ సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి, గోపాల పూర్ మాజీ సర్పంచ్ ఊరడి మంజుల మల్లారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ లు సుంకిశాల సంపత్ రావు, అరె శ్రీకాంత్, మాజీ సింగల్ విండో చైర్మన్ మంద రాజమల్లు, మాజీ వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, కోరు కంటి వెంకటేశ్వరరావు, శ్రీరామోజు తిరుపతి, గోనె నరసయ్య, ముత్తునూరి రాజ కమల్, గుండేటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page