విద్యార్థుల్లో పరివర్తన కోసం ప్రయత్నం…
ఆదర్శంగా నిలుస్తున్న జిల్లెల్ల హెచ్ఎం
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
విజ్ఞానాన్ని అందించే పాఠశాల నుండే విద్యార్థుల్లో నవ చైతన్యం నింపే ప్రయత్నం సాగుతోందక్కడ. సమాజ హితం, విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా చొరవ తీసుకుంటున్నారక్కడ. విద్యార్థి దశలోనే ప్రకృతిపై జరుగుతున్న విధ్వంసం గురించి అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో వారు అదే బాటలో నడుస్తారని గుర్తించారు ఆ పాఠశాల హెచ్ఎం. ఈ దశలో ముందుకు సాగుతున్న అనురాధ మేడం చేస్తున్న ప్రయత్నాలేంటంటే..?
ప్లాస్టిక్ రహిత సమాజం…
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ పాఠశాల ఆవరణ నుండే తనవంతు ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఇప్పటికే డస్ట్ బిన్స్ అన్నింటిని మార్పించిన ఆమె తాజాగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇండ్లలో జూట్, క్లాత్ బ్యాగ్స్ వాడేందుకు ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా జూట్ బ్యాగ్స్ అందించే కార్యక్రమం చేపట్టారు. పర్యావరణానికి సవాల్ గా మారిన ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగం విషయంలో పరిపూర్ణమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు హెడ్ మాస్టర్ అనురాధ. వందల సంవత్సరాలు గడిచినా ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడం లేదని, దీనివల్ల ప్రకృతిలో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్, పేరెంట్స్ తో ప్రతిన చేయించిన ప్లాస్టిక్ రహిత సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారికి కూడా ప్రధాన కారణం ప్లాస్టిక్ వినియోగమేనని దీనిని వినియోగించడం మానుకోవాలని ఆరోగ్య కార్యకర్తలతో చెప్పించారు. అంతేకాకుండా వ్యవ‘సాయం’ చేసే రైతులను కూడా ప్లాస్టిక్ ఎంతటి ఇబ్బంది కల్గిస్తోందో కూడా వివరించేందుకు చొరవ తీసుకున్నారు. సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులచే పంట పొలాల్లో ప్లాస్టిక్ భూతం వల్ల కలుగుతున్న నష్టం ఎంతమేర కల్గిస్తుందోనన్న విషయంపై అవగాహన కల్పించారు. చిరు ప్రాయం నుండే ప్లాస్టిక్ వాడడం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించి విద్యార్థులను ఆ దిశలో నడిపించినట్టయితే ముందు ముందు ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గిపోతుందన్న యోచనతో జిల్లెల్ల హైస్కూల్ హెచ్ఎం అనురాధ చొరవ తీసుకున్న తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థుల ఆరోగ్యంపై…
మరో వైపున విద్యార్థుల ఆరోగ్యంపై కూడా హెచ్ ఎం అనురాధ ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తరగతి గదులకు హతుక్కుపోతున్న విద్యార్థులు చాలినన్ని మంచి నీరు తాగడం లేదని గమనించిన ఆమె ఇప్పటికే ఈ పాఠశాలలో వాటర్ బెల్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల జరిగే ఇబ్బందులు ఏంటో వివరించి విద్యార్థులను ఆ దిశగా నడిపిస్తున్నారు. బడి అంటే పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టించడం కాదు… సమాజ విజ్ఞానంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న హెడ్ మాస్టర్ అనురాధను ఆదర్శంగా తీసుకున్నట్టయితే సర్కారు బడుల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.