ఆ భూములు వదిలేయండి… మావోయిస్టు పార్టీ హెచ్చరిక…

దిశ దశ, వరంగల్:

దశాబ్దాలుగా సాగు చేసుకుంటు జీవనం సాగిస్తున్న దళితులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించవద్దని మావోయిస్టు పార్టీ సూచించింది. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం సుదన్ పల్లి ప్రజలు భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే వారి గుండాలు ఎంతో మందిని హత్య చేశారని జెఎండబ్లుపి ఏరియా కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అప్పుడు రాజ్యమే రంగంలోకి దిగి ప్రజలను చిత్రహింసలకు గురి చేయడంతో పాటు లాకప్ డెత్ లకు, ఎన్ కౌంటర్లకు పాల్పడినా నిర్భంధాలను లెక్క చేయకుండా భూస్వాముల భూముల్లో ఎర్రజెండాలు పాతారని అన్నారు. పెసరు రామచంద్రారెడ్డికి చెందిన 20 ఎకరాల భూమిలో గత 35 ఏళ్ల నుండి 42 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయని వివరించారు. ఈ భూమికి ధర విపరీతంగా పెరగడంతో భూస్వాముల కన్ను ఆ భూమిపై పడిందని వెంకటేష్ అన్నారు. తిక్క దేవేందర్ మావోయిస్టు పార్టీ పేరు చెప్పి భూములను అమ్మేందుకు భూస్వామి పెసలు రామచంద్రారెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. రికార్డుల్లో కూడా దళితుల పేరిటే ఉన్నా ఈ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారన్నారు. తమ ఆధీనంలో ఉన్న భూమిని వదిలి పెట్టేది లేదని దళితులు పోరాడుతుంటే పెసలు రామచంద్రారెడ్డి, తిక్క దేవేందర్ ల అనుచరులు దౌర్జన్యానికి పాల్పడడ్డారని వెంకటేష్ ఆరోపించారు. అరెస్టలు చేయించడంతో పాటు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని బెదింపు కాల్స్ కూడా వచ్చాయన్నారు. అయితే దళితుల ఆధీనంలో ఉన్న ఈ భూమిని ఎవరూ కొనుగోలు చేయవద్దని, ఇప్పటికే కొన్న వారు తమ డబ్బులు వెనక్కి తీసుకోవాలన్నారు.

You cannot copy content of this page