ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు: సోనూ సూద్

ఇప్పట్లో తనకు రాజకీయీల్లోకి వచ్చే ఆలోచన లేదని ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజీగూడలో ది పార్క్ హోటల్‌లో నిర్వహించిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో సోనూ సూద్ మాట్లాడారు. ప్రతి రాష్ట్రంలోనూ వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాల ఏర్పాటు చేయడమే తన జీవిత లక్ష్యమని వెల్లడించారు.

ఫిక్కీ చైర్‌పర్సన్ శుభ్రా మహేశ్వరితో జరిగిన ముఖాముఖిలో సభ్యుల ప్రశ్నలకు సోనూ సూద్ సమాధానమిచ్చారు. తనకు ఎదురైన పలు ఘటనలను పంచుకున్నారు. ఓ రోజు రాత్రి ఇంటికెళ్లాక ఓ మహిళ తన ఇంటి ముందు కనిపించిందని.. ఆమె న్యూరాలజీ సమస్యతో బాధపడుతోందని చెప్పిందన్నారు. ఆమెను ఉదయం కలవమని చెప్పానని, ఆ రాత్రే ఓ డాక్టర్‌కు ఆమె రిపోర్టులు పంపుతూ మెసేజ్ చేశానని చెప్పారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆ డాక్టర్ స్పందించి పంపమన్నారని తెలిపారు. అలా వెళ్లిన ఆ మహిళ ఐదు నెలల చికిత్స అనంతరం కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని సోనూ సూద్ గుర్తు చేసుకున్నారు. అలాంటి డాక్టర్లు ఉండడం వల్లే సేవలు చేయగలుగుతున్నట్టు స్పష్టం చేశారు.

ఒకసారి జోధ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి కాలేయ మార్పిడి కోసం తనను సంప్రదించారని సోనూ సూద్ తెలిపారు. అపోలో ఆస్పత్రిని సంప్రదిస్తే రూ.40 లక్షల విలువైన చికిత్సను రూ.18 లక్షలకే చేస్తామన్నారని చెప్పారు. అయితే రోగి దగ్గర రూ.2లక్షలే ఉండడంతో రాజస్తాన్ సీఎంతో మాట్లాడితే ఆయన రూ.10 లక్షలు సాయం చేశారని తెలిపారు. మిగతా సొమ్ము తాను సమకూర్చినట్టు చెప్పారు. కాగా, ఆపరేషన్ తర్వాత సీఎం ఇచ్చిన సొమ్మును చెల్లించకుండా ఆ వ్యక్తి తన ఖాతాలోనే ఉంచుకున్నారని, ఇలాంటి సందర్భాలు సైతం ఎదురయ్యాయని సోనూ సూద్ తెలిపారు.

నాగ్‌పూర్‌కు చెందిన ఓ యువతికి శ్వాసనాళాలు దెబ్బతింటే హైదరాబాద్ తరలించి చికిత్స అందించానని.. అయితే ఆమె బతకలేదని తెలిపారు. యువతికి సహాయకుడిగా వచ్చిన ఆమె సోదరుడు కూడా మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి తాను నాగ్‌పూర్ వెళ్లినప్పుడు ఆ కుటుంబాన్ని తాను కలుస్తానని సోనూ సూద్ చెప్పారు. తాను ఇప్పటివరకు ఏడున్నర లక్షల మందికి సాయం అందించానని.. కానీ వారిలో 95 శాతం మందిని తాను చూడలేదని చెప్పుకొచ్చారు.

You cannot copy content of this page