దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావును పట్టుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఇలాంటి ఊహాగానాలు దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నాయన్న సీపీ ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఇంతవరకు తెలియదని చెప్పారు. ఆయన్ను పట్టుకోవడం లేదన్నది అవాస్తమని, ఆయన ఇంతవరకు దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదన్నారు. ఈ కేసులో పొలిటికల్ లీడర్ల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ కేసులో నిందితులంతా కూడా స్మార్ట్ గా, చాకచక్యంగా వ్యవహరించారన్నారు. వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించేలా ట్యాపింగ్ చేశారని, పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ కావడమనేది ఘోరమైన చర్య అని సీపీ వ్యాఖ్యానించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు అధికారులను అరెస్ట్ చేశామని, కొంతమంది పోలీసులను సాక్షులుగా చూపించి వారి వాంగ్మూలాలను నమోదు చేశామన్నారు.