అన్నారం ఇసుక రీచుల కోసం సరికొత్త పైరవీలు…
దిశ దశ, భూపాలపల్లి:
అన్నారం బ్యారేజీ సమీపంలో భారీ స్థాయిలో ఉన్న ఇసుక నిలువలను తొలగించేందుకు రీచులు ఇచ్చే పద్దతిలో ఈ సారి మార్పులు చేర్పులు చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. నేడో రేపో నోటీఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సరికొత్త విధానాన్ని అమలు చేయాలన్న పైరవీలు మొదలైనట్టుగా తెలుస్తోంది.
ప్రతిపాదనలు ఇలా…
అన్నారం బ్యారేజీ సమీపంలో 2 కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిలువలు పేరుకపోయాయని ఇరిగేషన్ అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ ఇసుకను తరలించేందుకు జిల్లా స్థాయి కమిటీ నిర్ణయం తీసుకోనుంది. జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీ ఆమోదం తెలిపినట్టయితే టీఎస్ఎండీసీ టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. అయితే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి లక్కి డ్రా సిస్టం ద్వారా కాంట్రాక్టర్లకు రీచులు అప్పగించాలన్న ప్రతిపాదనలో అధికారులు ఉన్నారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. తాజాగా కొంతమంది ఇసుక కాంట్రాక్టర్లు కీలక నాయకులపై ఒత్తిళ్లు తీసుకవస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సారి టెండర్ ప్రక్రియకు స్వస్తి పలికి నామినేషన్ ద్వారా ఇసుక రీచులను అప్పగించే విధంగా ఆదేశాలు ఇప్పించాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. 15 లక్షల మెట్రిక్ టన్నులకో ఇసుక రీచు చొప్పున ఏర్పాటు చేయాలని, టెండర్ విధానానికి స్వస్తి పలికి నామినేషన్ విధానం ద్వారా అయితే తమకు అన్నింటా లాభం చేకూరుతుందని కొంతమంది ఇసుక కాంట్రాక్టర్లు భావిస్తున్నట్టుగా సమాచారం.
నామినేషన్ కోసం…
ఇప్పటికే ఇసుక రీచుల విషయంలో విమర్శలు ఎధుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం నామినేషన్ల ప్రక్రియకు క్లియరెన్స్ ఇస్తే మాత్రం మరింత ఇరకాటంలో పడే ప్రమాదం లేకపోలేదు. ఆర్థికంగా కొంతమేర ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం కూడా తగ్గే అవకాశాలు లేకపోలేదు. ఇసుక పాలసీని రాష్ట్రంలో అమలు చేస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు కమర్షియల్ రీచులను నామినేషన్ విధానంలో అప్పగించలేదని తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మహాదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద 6 నెలల కోసం కమర్షియల్ రీచు ఒకటి ఇచ్చారని తెలుస్తోంది. ఇదే విధానాన్ని త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్ కు కూడా వర్తింపజేయాలని కొంతమంది పైరవీలు చేస్తున్నట్టుగా సమాచారం. 2 కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను టెండర్ ప్రక్రియ ద్వారా రీచులను అప్పగించినట్టయితే ప్రభుత్వానికి కొంతలో కొంత ఆదాయం వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రీచుల వారిగా బిడ్డింగ్ వేసే వారు రూ. 23 వేల చొప్పున నాన్ రిఫండ్ కింద ప్రభుత్వానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆదాయం అంతా కూడా ప్రభుత్వ ఖజానాలోకే చేరనుంది. ఓపెన్ టెండర్ విధానం వల్ల ఎంత ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పాల్గొంటే అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ నామినేషన్ విధానం ద్వారా అయితే నాన్ రిఫండ్ రూపంలో వచ్చే డిపాజిట్లు రాకపోయే అవకాశం ఉండకపోగా, పొలిటికల్ లీడర్ల కనుసన్నల్లో ఇచ్చే ఈ రీచులపై అజమాయిషి చేసే అవకాశం కూడా ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.