ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అలజడి…
నామినేటెడ్ పదవులు ఎఫెక్ట్…
దిశ దశ, కరీంనగర్:
ప్రశాంతంగా ఉన్న సంద్రంలో ఒక్కసారిగా కెరటాల అలజడి మొదలైనట్టుగా… అది కాస్తా సునామిని మరిపించినట్టుగా మారిపోయింది కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. చుక్కాని లేని నావాల ఉందనుకున్న కరీంనగర్ కేంద్రీకృతంగా బహు నాయకత్వం ఆధిపత్యం చెలాయిస్తుండడంతో అసలు సమస్య మొదలైంది. అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడం ఒక ఎత్తైతే… నామినేటెడ్ పదవులను కట్టబెట్టే విషయంలో ఓ నాయకుడికే ప్రాధాన్యత కల్పించడం మరో ఎత్తుగా మారింది. దీంతో కరీంనగర్ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నిన్నమొన్నటి వరకు ఒకే వేదికపై కనిపించి మెరిపించిన మంత్రుల మధ్య మళ్లీ ప్రచ్ఛన్న యుద్దానికి తెరలేచిందా అన్న చర్చ మొదలైంది. క్యాడర్ లో అయోమయం… కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి అన్నట్టుగా మారిపోయింది.
గతంలో ఇలా…
1999లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం అంతా ఇంతా కాదు. ఏజ్ గ్రూప్ కలవడంతో ఈ యంగ్ లీడర్లు ఇద్దరూ ఒకేతాటిపై నడుస్తూ ముందుకు సాగారు. శ్రీధర్ బాబు నోట వచ్చిందంటే పొన్నం చెప్పినట్టేనని… పొన్నం అన్నాడంటే శ్రీధర్ బాబు అభిప్రాయమేనన్న రీతిలో వీరి రాజకీయ సమీకరణాలు సాగాయి. 2009 తరువాత వీరిద్దరి మధ్య పెరిగిన అంతరంతో క్రమక్రమంగా దూరమవుతూ వచ్చారు. దీంతో అప్పటి వరకు పొన్నం వర్గమే శ్రీధర్ బాబు అనుచరులు… శ్రీధర్ బాబు అనుచరులే పొన్నం వర్గం అన్న విధానానికి బ్రేకులు పడ్డాయి. కరీంనగర్ లో దుద్దిళ్ల వర్గం వేరు… పొన్నం వర్గం వేరు అన్నట్టుగా వ్యవహరించింది ఇక్కడి క్యాడర్. ఈ పరిస్థితి తాజా అసెంబ్లీ ఎన్నికల వరకూ సాగినప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఇద్దరు క్యాబినెట్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం… చాలా సభల్లో ఇద్దరూ కలిసే కనిపిస్తుండడంతో రెండు వర్గాల వారు కాస్తా కుదుట పడ్డారు. సీఎం సభలో అయినా… ఇతర వేదికల్లో అయినా… చివరకు అసెంబ్లీలో అయినా కూడా తమ తమ ప్రసంగాల్లో ఒకరి పేరు మరోకరు ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడిందన్న ఆనందం కరీంనగర్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అయింది.
అంతలోనే షాక్…
ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు ఒకే ట్రాక్ పైకి వచ్చారని సంబరపడ్డ కరీంనగర్ పార్టీ నాయకులకు మాత్రం ఎంతో కాలం ఆనందాన్ని మిగల్చలేదు. పట్టుముని మూడు నెలల్లోనే మళ్లీ పొన్నం దుద్దిళ్ల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. కొద్ది రోజులుగా ఇద్దరు కమ్యూనికేషన్ గ్యాప్ మెయింటెన్ చేస్తున్నప్పటికీ మంత్రులు పర్సనల్ షెడ్యూల్ కారణంగా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారని అనుకున్నారంతా. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పదవుల జాబితా లీక్ కావడంతో ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు భగ్గుమన్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నాయకుల మధ్య కూడా అంతరం అంతగా పెరిగిపోవడానికి కారణమేదైనా… కరీంనగర్ కాంగ్రెస్ క్యాడర్ లో తమ వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నాలతో మాత్రం ఇద్దరు మంత్రుల మధ్య వైరం మళ్లీ స్టార్ట్ అయినట్టుగా స్పష్టం అవుతోంది. కరీంనగర్ కు చెందిన నామినేటెడ్ పదవుల పందేరంలో పొన్నం ప్రభాకర్ సూచించిన వారికి దక్కకపోవడంతో ఆయన వర్గం అంతా కినుక వహించింది. తమకు అన్యాయం జరిగిందంటూ పొన్నం వద్దకు చేరుకుంటున్న పార్టీ నాయకుల బాధలు విన్న ఆయన అధిష్టానం పెద్దల ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఇంఛార్జీ దీప్ దాష్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీలోని ఇతర పెద్దలకు కూడా పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నామినేటెడ్ పదవుల కెటాయింపు తీరుపై ఫిర్యాదు చేసినట్టుగా పార్టీ వర్గాల సమాచారం. తాను ప్రతిపాదించిన వారికి పదవులు ఇవ్వలేదని తన సొంత నియోజకవర్గం విషయంలో ఇలా చేస్తే ఎలా అంటూ పొన్నం ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. గతంలో కరీంనగర్ లోకసభకు ప్రాతినిథ్యం వహించారని, ప్రస్తుతం హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కరీంనగర్ విషయంలో పొన్నం నిర్ణయాలకు కూడా ప్రాధాన్యత ఉండాల్సిందేనని ఆయన వర్గం అంటోంది. నామినేటెడ్ పదవులను అలాట్ చేసేప్పుడు అయినా కనీసం పొన్నం ప్రభాకర్ తో చర్చించలేదన్న వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే గతంలో శ్రీధర్ బాబు ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేయడం, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని అందుకే ఆయన ప్రతిపాదనలకు అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చిందని ఆయన వర్గం అంటోంది. తాము కూడా పార్టీ కోసం కష్టపడ్డ వారమని అందుకే శ్రీధర్ బాబు తమ పేర్లను ప్రతిపాదించారని అంటున్నారు.
ఆన్ హోల్డ్…
చిలికి చిలికి గాలి వానలా మారిన నామినేటెడ్ పదవుల కెటాయింపు వ్యవహారం లోకసభ ఎన్నికలకు ముందు తెరపైకి తీసుకొచ్చి అధిష్టానం లేనిపోని తలనొప్పిని కొని తెచ్చుకున్నట్టయింది. ఈ విషయంలో వస్తున్న ఫిర్యాదుల పరంపరతో ప్రస్తుతానికి ఈ జాబితాను హోల్డ్ లో పెట్టాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. లోకసభ ఎన్నికల తరువాతే బాధ్యతలు తీసుకోవాలని… అప్పుడే ఉత్తర్వులు జారీ చేస్తామంటూ అధిష్టానం చెప్పిందని నామినేటెడ్ పదవులు ఆశించిన పార్టీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.