రాఘవాపూర్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్
దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ట్రైన్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ రవాణా చేస్తున్న గూడ్స్ రైలు జిల్లాలోని రాఘవాపూర్, కన్నాల స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాలు తప్పడంతో మూడు ట్రాకులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గూడ్స్ రైలును తొలగించి ట్రాకులను పునరుద్దరించే పనిలో నిమగ్నం అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల నుండి ఉత్తరాది రాష్ట్రాలకు వెల్లే మెయిన్ లైన్ కావడంతో ప్రయాణీకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన రైళ్లు ఈ మార్గం గుండానే ఉత్తరాది రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో ప్రయాణీకులను తరలించే రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లను కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. సుదూర ప్రాంతాల నుండి వెళ్లే రైళ్లను ఇతర మార్గాల మీదుగా మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీకి వెల్లే మార్గంలో ప్రమాదం సంభవించడంతో రైల్వేపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది.
‘‘బండి’’ ఆరా…
గూడ్స్ రైల్ పట్టాలు తప్పిన సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రైల్వే అధికారులతో మాట్లాడారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ట్రాక్ పునరుద్దరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దక్షిణాది రాష్ట్రాలను ఉత్తరాదికి అనుసంధానం చేసే మార్గం అయినందున్న త్వరితగతిన పనులు చేపట్టేందుకు చొరవ చూపాలని సూచించారు.
ప్రయాణీకుల అవస్థలు…
మంగళవారం రాత్రి గూడ్స్ రైల్ పట్టాలు తప్పడంతో రైల్వే అదికారులను ఆ మార్గం మీదుగా వెల్లే ఇగర ట్రైన్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఆయా రైళ్లలో ప్రయాణిస్తున్న వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైళ్లలో ప్రయాణిస్తున్న వారికి అసలేం జరిగిందో కూడా అంతుచిక్కకుండా పోయింది. అంతేకాకుండా తాగు నీటితో పాటు ఆహారం కూడా అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడ్డారు.
రీ షెడ్యూల్….
పెద్ద సంఖ్యలో రైళ్లను అప్పటికప్పుడు రద్దు చేయగా కొన్ని రైళ్లను దారి మళ్లించి ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చేందుకు టైం టేబుల్ ను రీ షెడ్యూల్ చేశారు. కొన్నింటిని బల్లార్ష, చంద్రపూర్ వద్ద డైవర్ట్ చేసి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల మీదుగా, మరికొన్నింటిని గూడురు, గుంతకల్ మీదుగా దారి మళ్లించారు చాలా ఖాజీపేట, పెద్దపల్లి మార్గమధ్యలో ఉన్న రైళ్లలో ప్రయాణిస్తున్న వారు మాత్రం రాత్రంతా ఇబ్బందులో పడిపోయారు. అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఆశ్రయించి సమీప ప్రాంతాల వారు గమ్యస్థానాలకు చేరుకున్నారు. దేశంలోనే అత్యంత కీలకమైన రైల్వే రూట్ లోనే ప్రమాదం జరగడం వల్ల ట్రైన్ ల రాకపోకల వ్యవస్థ అంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయినట్టయింది.