విప్లవయోధున్ని స్మరిస్తున్న తీరు
దిశ దశ, వేములవాడ:
జాతీయోద్యమంలో కీలక భూమిక పోషించిన ఆ వీరున్ని కొలిచే సంస్కృతి కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. ప్రాంతీయోద్యమంలో పోరాటం చేసిన వీరులతో పాటు ఆయనకు ఇక్కడ అరుదైన గౌరవం దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో బహుష ఇంతటి ఆదరణ లభించిన యోధుడు ఈయనొక్కడ కావచ్చు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి జాతీయ నేతల విగ్రహాలు ఏ పల్లెలో చూసినా కనిపిస్తుంటాయి. కానీ ఆ ప్రాంతంలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా మన్నెం వీరుని విగ్రహాలు సాక్షత్కరిస్తుండడం గమనార్హం.
ఎక్కడ అది..
ఉత్తర తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు పల్లెల్లో మన్నెం వీరుడు అల్లూరి సీతారామారాజు విగ్రహాలను స్థాపించారు. రెండున్నర దశాబ్దాల నాడు ఎవరూ ఊహించని విధంగా చందుర్తి, రుద్రంగి, మరిమడ్ల, మానాల ప్రాంతాల్లోని పల్లెల్లో మన్నెం వీరుని విగ్రహాలు ఏర్పాటు చేశారు. నిజాం విముక్తి కోసం పోరాటం చేసిన ప్రాంతమైన వేములవాడ ఏరియాలో ఆంగ్లేయులను ఎదురించి పోరాడిన మన్నెం వీరున్ని స్మరించే సంస్కృతి తెలంగాణాలో నెలకొనడం విచిత్రమనే చెప్పాలి. తెల్ల దొరలను ఎదురించిన అల్లూరికి ఉత్తర తెలంగాణాతో సంబంధం లేకున్నా ఇక్కడ మాత్రం ఆయన విగ్రహాలు ఏర్పాటు కావడం విశేషం.
కారణం ఏంటంటే…?
1990వ దశాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పీపుల్స్ వారు తిరుగులేని ఆదిపత్యం చెలాయించేది. ఈ క్రమంలో పశ్చిమ ప్రాంతమైన సిరిసిల్ల ఏరియాలో జనశక్తి అగ్రనేత కూర రాజన్న నేతృత్వంలో జనశక్తి పార్టీ సాయధ పోరుబాటతో పీపుల్స్ వార్ పై పైచేయిగా నిలిచింది. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో జనశక్తి బలోపేతమై పోలీసు యంత్రాంగానికి మింగుడుపడని స్థితికి చేరుకుంది. తూర్పు అడవుల్లో పీపుల్స్ వార్, పశ్చిమ అడవుల్లో జనశక్తి దళాలను ఏరివేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగింది. సిరిసిల్ల ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో జనశక్తి పల్లె పల్లెన విస్తరించిపోయిన కాలంలో ఎన్ కౌంటర్ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. జనశక్తి పార్టీకి చెందిన అమరవీరులను స్మరిస్తూ ఏర్పాటు చేసిన స్థూపాలను కూల్చివేసే సంస్కృతి కూడా కొనసాగేది. దీంతో తమ పార్టీపై సాగుతున్న తీవ్రమైన నిర్భంధంలో తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంతో పాటు ప్రభుత్వ ఎత్తులకు అందకుండా వ్యవహరించేందుకు వ్యూహ రచన చేశారు అప్పటి సిరిసిల్ల ఏరియా జనశక్తి నేతలు. 1999 నుండి 2002 సంవత్సరం వరకు జనశక్తి వ్యూహాత్మకంగా ముందుకు సాగి తన పంథాను సఫలీకృతం చేసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా జనశక్తి నేతలు తమ పార్టీ అమరులను స్మరించుకునే స్థూపాలను కూల్చుతున్నందున విప్లవకారులను ఈ ప్రాంత ప్రజలకు పరిచయం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగారు. ఇందులో భాగంగానే ఆయా గ్రామాల్లో అటు అల్లూరి సీతరామారాజు, సుభాష్ చంద్రబోస్ ల విగ్రహాలు నెలకొల్పే సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టారు. జాతీయోద్యమకారుల విగ్రహాలను కూల్చడం సరికాదని ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని జనశక్తి అంచనా వేసింది. ఇందుకు తగ్గట్టుగానే వేములవాడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహాలు నేటికి సాక్షాత్కరిస్తున్నాయి.