దిశ దశ. మంచిర్యాల:
బాహుబాలి మూవీలో పసికందు రమ్యకృష్ణ చేతిలో ఉన్నట్టుగా గ్రాఫిక్స్ చేసి నీటిని దాటుతుండగా తీసిన సీన్ ప్రతి ఒక్కరిని ఆకర్శించింది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో గ్రాఫిక్ డిజైనర్ తన క్రియేటివిటీకి పదునుపెట్టి మరీ ప్రేక్షకులను కట్టిపడేలా తీశారు. ప్రేక్షకుల నుండి ఎంతో ఆదరణ పొందిన ఈ సీన్ లో పసికందును కాపాడేందుకు రమ్యకృష్ణ చేసిన సాహసం ప్రతి ఒక్కరి హృదయాలను కదలించివేసింది. అయితే ఇదంతా వెండి తెరపై ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు గ్రాఫిక్స్ చేసి చూపించిన సినిమా మాత్రమే. అయితే రెండు రోజుల క్రితం ఓ జిల్లాలో బాహుబలి సీన్ ను మరిపించే ఘటన సాక్షాత్కరించింది. ఏడాది వయసున్న తమ బిడ్డను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు పడిన నరకయాతనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కొమురం భీం జిల్లాలో…
అడవులు… ఆదివాసీల ఖిల్లాలో మాత్రం రియల్ స్టోరీనే చోటు చేసుకుంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి విన్న ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కెరమెరి మండలం లక్నాపూర్ కు చెందిన కవిత, పవన్ దంపతులకు ఏడాది క్రితం బాబు జన్మించాడు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దిగువ ప్రాంతం కావడంతో ఎగువ నుండి వస్తున్న నీటి ప్రవాహంతో ఈ వాగు పొంగిపొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ఈ వాగు మీదుగా బయటకు వెళ్లడానికి కూడా గ్రామస్థులు వెనకంజ వేస్తున్నారంటే వరద ప్రవాహం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పవన్, కవితల కొడుకు విపరీతమైన జ్వరంతో బాధ పడుతుండగా చిట్కా వైద్యంతో తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తమ బిడ్డను ఎలాగైనా కాపాడుకునేందుకు వాగు దాటి మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ కు చూపించడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది వారికి. దీంతో తమ బంధువు సహాయంతో ఏడాది వయసున్న తమ బిడ్డను ఎత్తుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటేందుకు సాహసించారు. ఓ వైపున వరద ప్రవాహం మరో వైపున చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ ఆకాశానికి బిడ్డను ఎత్తి భయం భయంగా లక్నాపూర్ వాగు దాటారు. కెరమెరి చేరుకున్న ఆ తల్లిదండ్రులు తమ బిడ్డకు చికిత్స చేయించుకుని ఆదివారం అక్కడే ఉండిపోయారు. సోమవారం వాగులో కొంతమేర వరద తగ్గినప్పటికీ నీటి మట్టం మాత్రం ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ ఇంటికి చేరాలన్న ఆతృతతో చిన్నారిని తిరిగి అలాగే ఎత్తుకుని తమ గ్రామానికి చేరుకున్నారు. పవన్, కవిత దంపతులు తమ బిడ్డను కాపాడుకునేందుకు పడ్డ ఇబ్బందులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో లక్నాపూర్ వాసుల దీనస్థితి బాహ్య ప్రపంచానికి తెలిసింది.
ఏటా తప్పని తిప్పలు…
లక్నాపూర్ వాగుపై వంతెన నిర్మాణానికి 2016లోనే నిధులు మంజూరైనా నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. అసంపూర్తి నిర్మాణంలో ఉన్న వంతెన కాంట్రాక్టర్ పనితీరుకు నిలువుటద్దంగా నిలుస్తోంది. విద్యనందించేందుకు అన్నార్పల్లి పంచయితీ పరిధిలోని గ్రామాలకు టీచర్లు రావాలన్నా ఈ వాగు దాటాల్సిందే తప్ప మరో దారి లేదు. ఒక వేళ టీచర్లు వాగు దాటేందుకు ధైర్యం చేయనట్టయితే అక్కడి విద్యార్థులకు విద్యాగంథం అందించే పరిస్థితి కూడా లేకుండా పోతోంది. ఎగువ ప్రాంతం నుండి భారీగా వరదలు వచ్చినట్టయితే లక్నాపూర్ వాగు దాటడం కూడా గగనమేనని స్థానికులు చెప్తున్నారు. వాగు పొంగిపొర్లినప్పుడు అనారోగ్యం బారిన పడినట్టయితే కెరమెరికి చేరుకునే సాహసం కూడా చేయలేమని గ్రామస్థులు అంటున్నారు. దీంతో కొన్నిసార్లు తమ గ్రామానికి చెందిన వారు ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆవేదనతో తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని లక్నాపూర్ వంతెనను త్వరితగతిన పూర్తి చేయాలని అభ్యర్థిస్తున్నారు గ్రామస్థులు.