కలెక్టరేట్ కు చేరుకున్న ప్రజలు
దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. మూడు రోజుల క్రితం ఇథనాల్ పరిశ్రమ కోసం అలాట్ చేసిన భూమిని చదును చేసే పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాశిగామ, స్తంభంపల్లి గ్రామాల ప్రజలు పనులను అడ్డుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలపడం, ఆందోళన కారులుకు పోలీసులకు మధ్య వాగ్వాదం చేసుకుంది. ఈ నేపథ్యంలో జరిగిన తోపులాటలో కొంతమందికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ ఆందోళనలు మూడు రోజులుగా యథావిధిగా సాగుతూనే ఉండడంతో పోలీసులు అక్కడే మోహరించాల్సి వచ్చింది. తాజాగా సోమవారం ప్రజా వాణి కార్యక్రమం పురస్కరించుకుని వెల్గటూరు మండలానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున జగిత్యాల కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఇథనాల్ ప్యాక్టరీని నిర్మించొద్దంటూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించేందుకు జిల్లా కేంద్రానికి వచ్చారు. వీరంతా కలెక్టరేట్ ముందు నిరసన తెలుపుతూ తమకు ఆ పరిశ్రమ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జగిత్యాల పోలీసులు కలెక్టరేట్ ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.