‘‘బావోబాబ్’’ చెట్ల ఉనికి…
దిశ దశ, జాతీయం:
ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కనిపించే ఈ చెట్లు ఇండియాలో కూడా ఉన్నాయి తెలుసా..? ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కనిపిస్తాయనకుంటున్న ఈ వృక్షాలు మన దేశానికి దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితమే వచ్చాయి. ఆయా దేశాల నుండి వీటిని తెప్పించి మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నాటారు కూడా. అయితే వీటిని ఆదరించే వారు లేకపోవడంతో దేశ వ్యాప్తంగా వీటి ఉనికి చేరలేకపోయింది. కానీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో బావోబాబ్ చెట్లు సాక్షాత్కరిస్తున్నాయి.
ఎన్నెన్నో ప్రత్యేకతలు…
బావోబాబ్, అడాన్సోనియా అని పిలువ బడే ఈ చెట్లు ఆఫ్రికా దేశాల్లో మాత్రమే ఉండేవి. వెయ్యేళ్ల క్రితం వీటిని అప్పటి రాజులు ఆఫ్రికా దేశాల నుండి తెప్పించి మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నాటించారు. నేటికీ వాటి ఉనికి ఆయా ప్రాంతాల్లో ఉండడం గమనార్హం. విదేశాల్లో మాత్రమే ఉన్నాయనకుంటున్న ఈ చెట్లు భారదేశంలోని తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో నేటికీ ఉన్నాయి. సహజసిద్దంగా భూమిలోని వనరులను అందిపుచ్చుకుని పౌషకాలను అందించే బావోబాబ్ చెట్ల ప్రత్యేకత అంతా ఇంతా కాదు. 8 రకాల జాతులు ఉ:డే బావోబాబ్ చెట్లు పోర్చుగీస్ వారు భారతదేశానికి తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. 3 వేల సంవత్సరాల పాటు జీవిస్తాయని చెప్తున్న ఈ చెట్లు 16 నుండి 98 అడుగుల ఎత్తులో పెరుగుతాయి. భూమి పైకి ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ ఈ చెట్లు వేర్లు అంతే స్థాయిలో భూమిలోపలకు చొచ్చుకుని పోతాయి. ఈ వేర్ల ద్వారా భూమిలో 600 ఫీట్ల లోతున ఉన్న నీటిని కూడా ఆకర్షించుకుని వీటి గర్భంలో దాచుకుంటాయి. ఈ కారణంగానే చెట్టు కాండం పరిమాణం 23 నుండి 36 అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే చాలా కాలం వరకు ఈ చెట్లను సహజసిద్దంగానే వెలిశాయని అనుకున్నారు కానీ ఆ తరువాత చెట్టు బెరడు తొలగించినప్పుడు వచ్చిన జలధారను గమనించారు. చెట్టు కాండంలోపల ఒరలు ఒరలుగా (ట్రంకు బాక్సు)ల వలె సహజంగానే ఏర్పడి ఉంటాయి. వాటిలో భారీ ఎత్తున నీరు నిలువ చేసి ఉన్న విషయాన్ని గమనించిన పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. బావోబాబ్ చెట్టు కాండంలో 120,000 లీటర్లు (32,000 US గ్యాలన్‌ల) వరకు నీరు నిలువ ఉంటుందని గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో తల కిందులుగా ఉండే చెట్టు అని కూడా పిలిచే ఈ చెట్టు కాయలు కూడా పోషక విలువలను అందిస్తాయి. బెర్రీల్లాగా కనిపించే ఈ చెట్టు కాయలు ఎండిపోయిన సొరకాయల్లా ఉంటాయి. అయితే ఈ కాయలు చెట్టు నుండి తెంపిన తరువాత కూడా కాండం పైన ఉంచి నిలవు చేస్తే ఎంత కాలం అయినా కూడా చెడిపోకపోవడం మరో స్పెషాలిటీ. ఈ కాయలో వచ్చే గింజలు కిడ్నీ ఆకారంలో ఉంటాయి. ఈ గింజలపై ఉన్న పదార్థాన్ని తినేందుకు నోట్లో వేసుకుని చప్పరించి తింటుంటారు. పుల్లగా ఉండే ఈ గింజలపై ఉన్న గుజ్జు వల్ల కూడా వివిధ రకాల పోషకాలు అందుతాయి.
‘‘మాండూ’’ కా ఇమ్లీ…
అయితే మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా మాండవ్ ఘాట్ లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. 1450లో వీటిని ఈ ప్రాంతంలో నాటించారని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. మాండవ్ ఘాట్ లో కనిపిస్తున్న ఈ అరుదైన వృక్షాలను ‘‘మాండూ’’ కా ఇమ్లీ అని కూడా పిలుస్తుంటారు. పులుపుగా ఉండే కాయ లోపలి భాగం అంతా కూడా పోషకాలతో కూడినదేనని స్థానికులు విశ్వసిస్తున్నారు. బావోబాబ్ చెట్లు అందించే కాయలను, గింజలను సేకరించి స్థానికులు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ చెట్టుకు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే… సాయంత్రం వేళల్లో పూలు కాస్తుంటాయి. అవి నెమ్మదిగా విరబూసుకుంటున్న తీరును ప్రత్యక్ష్యంగా వీక్షించవచ్చు. అయితే తెల్లవారు జాము వరకు అవి వాడిపోతుంటాయి.