దిశ దశ, హైదరాబాద్:
జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు మరో ఝలక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని నోటీసులు ఇచ్చి 24 గంటలు తిరగక ముందే మరో సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మంగళవారం ఉదయం నుండి జూనియర్ పంచాయితీ కార్యదర్శుల ఇళ్లకు నోటీసులు అంటించాలని ఆదేశించడంతో సిబ్బంది ఆ పనిలో నిమగ్నం అయ్యారు. రాష్ట్రంలోని 9,355 మంది జూనియర్ కార్యదర్శుల ఇళ్లకు కూడా ఇదే పద్దతిన నోటీసులు అంటించనున్నట్టు తెలుస్తోంది. మంగళవారం సాయత్రం 5 గంటల వరకు విధుల్లో చేరనట్టయితే ఉద్యోగాల నుండి తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నోటీసులు జూనియర్ కార్యదర్శుల ఇళ్లకు కూడా అంటించి చర్యలకు పూనుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే చకచకా కార్యదర్శులకు నోటీసులు జారీ చేసే పనిలో నిమగ్నం అయినట్టు అర్థమవుతోంది.
తగ్గేదేలే అంటున్న వైనం
అయితే సర్కారు నిర్ణయానికి అనుగుణంగా మాత్రం జూనియర్ కార్యదర్శులు సుముఖంగా లేరన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము వెనక్కి తగ్గేది మాత్రం లేదని సంఘం ప్రతినిధులు తేటతెల్లం చేస్తున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్న ఆలోచనలో జూనియర్ కార్యదర్శులు ఉన్నట్టు సమాచారం. సంఘాల్లో చేరవద్దని, సమ్మెలు చేయవద్దని అగ్రిమెంట్ రాసిచ్చారంటూ ప్రభుత్వం వాదిస్తుండగా జూనియర్ కార్యదర్శులు అదే అగ్రిమెంట్ లోని అంశాలను ఊటంకిస్తున్నారు. మూడేళ్ల తరువాత నాల్గోతరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామన్న విషయాన్ని ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని, రెగ్యూలరైజ్ చేస్తామని కూడా అందులో పేర్కొన్నదని, నోటిఫికేషన్ లోనూ ఈ అంశాన్ని చేర్చారంటూ కార్యదర్శులు వాదిస్తున్నారు. అంతేకాకుండా తాము మూడేళ్ల కాలంలో ఏ యూనియన్ లో చేరలేదని, నిరసనలు తెలపలేదని, సర్కారు చెప్పినట్టుగా నడుచుకోవడమే కాకుండా అదనంగా మరో ఏడాది పాటు వేచి చూశామని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమపై చర్యలకు పూనుకుంటే ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేయాలని కూడా జూనియర్ కార్యదర్శుల సంఘం ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post