దిశ దశ, కాళేశ్వరం:
సింగర్ మధు ప్రియ కాళేశ్వరం గర్భాలయంలో షూటింగ్ చేసిన విషయంపై అర్చకునికి తాఖీదులు ఇచ్చారు దేవాదాయ శాఖ అధికారులు. ఆలయంలో షూటింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చారని, సంబంధిత అధికారుల నుండి ఈ విషయంపై స్పష్టత తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని డ్యూటీలో ఉన్న అర్చకుడు రామకృష్ణకు నోటీసులు ఇచ్చినట్టుగా ఆలయ ఈఓ ఒఖ ప్రకటనలో తెలిపారు.
ఆదేశాలు ఇచ్చారా..?
సింగర్ మధు ప్రియ షూటింగ్ విషయం గురించి ఆలయ అధికారులను మొబైల్ పోన్లో అనుమతి తీసుకున్నారని, అయితే ఆలయ ఆవరణతో పాటు గోదావరి నదిలో షూటింగ్ చేసుకుంటామని చెప్పారని ఆలయ అధికారులు చెప్తున్నారు. మధు ప్రియకు మౌఖికంగా అనుమతి ఇచ్చామని ఎక్కడి వరకు అనుమతించాలి అన్న విషయంపై డ్యూటీలో ఉన్న ఉద్యోగులకు కానీ, అర్చకులకు కానీ సదరు అదికారి సూచనలు జారీ చేశారా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. మధు ప్రియ షూటింగ్ కోసం వస్తున్నారని షూటింగ్ యూనిట్ కు ఎక్కడి వరకు అనుమతించాలి అన్న విషయం గురించి ఆలయంలో డ్యూటీ చేస్తున్న వారికి ఆదేశాలు ఇచ్చినట్టయితే ఇంత దూరం వచ్చేది కాదుకదా అన్న చర్చ మొదలైంది.
మిగతా వారో..?
గర్భాలయంలో మధు ప్రియ షూటింగ్ చేసిన విషయం మీడియాలో కథనాలు వచ్చేవరకు తమకు తెలియలేదని ఆలయ అధికారులు ఇచ్చిన ప్రకటనలో వెల్లడించారు. అంటే అక్కడ డ్యూటీలో ఉన్న మిగతా అర్చకులు, ఉద్యోగులు అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం నిర్లక్ష్యం ఉన్నట్టు కాదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా గర్భాలయంలోకి షూటింగ్ యూనిట్ వెల్తున్న క్రమంలో రాజగోపురం వద్ద, గర్భాలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో అర్చకులతో పాటు ఉద్యోగులు కూడా డ్యూటీలో ఉండడం కామన్. వీరందరిని దాటుకుని మధు ప్రియ వెంట వచ్చిన షూటింగ్ యూనిట్ లోపలివరకు ఎలా వెళ్లగలిగారన్నదే అంతుచిక్కకుండా పోతోంది. మధు ప్రియ షూటింగ్ యూనిట్ ఎలా చిత్రీకరించారు..? గర్భాలయం తలుపులు మూసారా లేదా అన్న విషయంపై ఆరా తీశామని, అయితే అలాంటిదేమీ లేదని ఆలయ అధికారులు ఇఛ్చిన ప్రకటనలో వెల్లడించారు. గర్భాలయం తలుపులు వేసిన విషయంలో క్లారిటీ ఇచ్చిన దేవాలయంలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు, అర్చకులు… షూటింగ్ విషయంలో ఈఓకు కానీ ఇతర స్థాయి అధికారులకు కానీ సమాచారం ఇవ్వకపోవడం క్రమ శిక్షణా చర్యల కిందకు రానట్టుగానే పరిగణిస్తున్నట్టుగా అనిపిస్తోంది. కేవలం డ్యూటీలో ఉన్న అర్చకుడు రామకృష్ణకు నోటీసులు ఇచ్చి మిగతా వారికి మినహాయింపు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నది అంతుచిక్కకుండా పోతోంది.
ఆమెపై చర్యలు..?
దేవాదాయ శాఖ అధికారులు మధు ప్రియ షూటింగ్ విషయంలో శాఖపరమైన విచారణ జరిపి నోటీసులు ఇవ్వడంతోనే సరి పెడ్తారా లేక నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన మధు ప్రియపై దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. న్యూస్ కంటెంట్ ఉన్న ఛానెల్స్ ఆలయం గురించి ప్రచారం చేసినట్టు అవుతుంది కానీ కమర్షియల్ పాటల చిత్రీకరణ కోసం షూటింగ్ చేయడం కూడా తప్పిదమే అవుతుందన్న విషయాన్ని ఆలయ అధికారులు విస్మరిస్తున్న తీరు స్థానికంగా విస్మయం వ్యక్తం అవుతోంది. మొబైల్ ఫోన్లో మౌఖికంగా అనుమతులు ఇచ్చిన దేవాదాయ అధికారులు తాము చేసిన సూచనలను అతిక్రమించడం దేవాదాయ శాఖ చట్టాలను ఉల్లంఘించినట్టేనంటూ చర్యలకు పూనుకుంటారా లేదా అన్న విషయాన్ని కాళేశ్వరం ఆలయ అధికారులు తేల్చాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో రాజకీయ నాయకులు, చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారు కూడా సోషల్ మీడియా అకౌంట్లలో లైవ్ టెలికాస్ట్ చేసుకునేందుకు, ఆ తరువాత వాటిని తమ అకౌంట్లలో షేర్ చేసేందుకు కూడా గర్భాలయంలోకి కెమెరాలను తీసుకొస్తున్న సందర్బాలు లేకపోలేదు. అటువంటి వారిని కూడా కట్టడి చేసేందుకు దేవాదాయ శాఖ చట్టాలను అమలు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.