దిశ దశ, పెద్దపల్లి:
నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్టీపీసీ) రామగుండం పరిధిలోని కుందన్ పల్లి యాష్ ప్లాంటు నుండి తరలి వెల్తున్న లారీలకు ఇస్తున్న వే బిల్లుల్లో ఏముంది..? అసలా వే బిల్లు జారీ చేస్తున్నదెవరూ..? దానిపై సంతకం చేస్తున్నదెవరూ..?
హైవే అథారిటీ పేర…
ఎన్టీపీసీకి సంబంధించిన ఈ యాష్ ప్లాంటు నుండి బూడిదను గ్రీన్ ఫీల్డ్ హైవేకు తరలించేందుకు అనుమతులు ఇచ్చారు అధికారులు. ఇందుకు సంబంధించిన లోడింగ్ అన్ లోడింగ్ ప్రక్రియను కొనసాగించేందుకు కొన్ని ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ యాష్ ప్లాంటు నుండి లారీలలో బూడిద రవాణా చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ తంతుపై రాజకీయ నాయకుల జో్క్యంతో అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో లారీలు యాష్ తరలిస్తున్నప్పుడు ఇస్తున్న ఓ సర్టిఫికెట్ పై ఇస్తున్న వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఎన్టీపీసీ ఆధీనంలో ఉన్న యాష్ ప్లాంటు నుండి రవాణా చేసేందుకు ఇస్తున్న వే బిల్లుపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) – KD01 (M/s HGIEL), ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఖమ్మం, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మమత హస్పిటల్ రోడ్, ఖమ్మం అడ్రస్ ముద్రించి ఉంది. ఈ రిసిప్ట్ లో వివిధ రకాల కాలమ్స్ ఉండగా అందులో కేవలం 16 టైర్ల లారీ అని మాత్రమే రాస్తున్నారు కానీ… సదరు లారీలో ఎంత క్వాంటిటీ బూడిద తరలి వెల్తున్నదన్న విషయాన్ని మాత్రం వివరించడం లేదు. మరో వైపున ఈ రిసిప్ట్ లో ఎన్టీపీసీ తరుపున ప్రతినిధి సంతకం చేస్తుండగా, ఇన్, ఔట్ గేటు వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ బలగాలు స్టాంప్ వేసి పంపిస్తున్నాయి.
ట్విస్టులే… ట్విస్టులు…
ఎన్టీపీసీ హైవే అథారిటీ కాంట్రాక్టర్ కు యాష్ తరలించుకపోయేందుకు అనుమతించగా, సంబంధిత శాఖ అధికారుల అనుమతులు తీసుకుని చత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్ లోని కేంద్ర కార్యాలయం నుండి ప్రైవేటు ఏజెన్సీలు బూడిదను లోడ్ చేసి వర్క్ ప్లేస్ కు పంపిస్తున్నాయి. అయితే సదరు ఏజెన్సీలు ఎక్కడి నుండి బూడిద తీసుకెళ్లాలి..? అన్న విషయంతో పాటు ఎంత క్వాంటిటీ బూడిద తీసుకెల్తున్నారు అన్న విషయాలను ఎన్టీపీసీకి చెందిన ప్రతినిధులు ప్లాంటులో పర్యవేక్షిస్తున్నారు. లోడ్ అయిన లారీకి ఇస్తున్న రిసిప్ట్ లాంటి వే బిల్లుపై ఎన్టీపీసీ ప్రతినిధులు సంతకం చేస్తున్నారు. ఎన్టీపీసీ పరధిలో ఉన్న యాష్ ప్లాంటు నుండి బూడిద తరలిస్తున్న లారీలకు వే బిల్లు లేదా రిసిప్ట్ ను నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన వారు ఇస్తున్నట్టుగా ఉంది. ఎన్టీపీసీ యాష్ ప్లాంటులో నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన వారు తరలించుకునేందుకు అనుమతించినందున వారే వే బిల్లు ఇస్తున్నారన్న వాదనలు వినిపించినట్టయితే ప్లాంటు వద్ద పర్యవేక్షణ బాధ్యతలు ఎన్టీపీసీ చేస్తోంది. ఎన్టీపీసీ పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఆ సంస్థ పరిధిలో ఉన్న ప్లాంటు అయినందున వే బిల్లు ఎన్టీపీసీ పేరిట విడుదల చేయాల్సి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్టీపీసీ ప్లాంటు నుండి తరలిస్తున్న బూడిదకు నేషనల్ హైవే అథారిటీ వారే లోడింగ్ చేయించుకుని వే బిల్లు జారీ చేస్తుండగా ఇదే సంస్థ ప్రతినిధులు గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద యాష్ చేరినట్టుగా సర్టిఫై చేస్తున్నారు. ఎన్టీపీసీకి చెందిన యాష్ ప్లాంటు నుండి తరలిస్తున్న బూడిద విషయంలో సదరు సంస్థ నామమాత్రపు పాత్ర పోషిస్తున్నట్టుగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే అయినందును ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకున్నా… ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా లోడింగ్, ట్రాన్స్ పోర్టు వ్యవహారాలు చేయిస్తున్నారన్న విషయం గమనించాల్సి ఉంది. ఈ వే బిల్లులో కేవలం లారీ టైర్ల గురించి వివరిస్తున్నారు కానీ… ఆ లారీలో యాష్ ఎంత తూకంలో వెల్తుందోనన్న విషయాన్ని మాత్రం వివరించడం లేదు. కానీ గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టు ఏజెన్సీ మాత్రం లారీల్లో తరలిస్తున్న బూడిదకు వెయిమెంట్ ఆధారంగానే బిల్లులు ఇస్తుండడంతో పరోక్షంగా రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘించినట్టుగా స్పష్టం అవుతోంది.