కరీంనగర్ కేసుల పరంపర పుట్టి ముంచనుందా..?

ప్రజల్లో చర్చ… ప్రతినిధుల్లో ఆందోళన…

బీఆర్ఎస్ అభ్యర్థి తేరుకోకపోతే కష్టమే…

దిశ దశ, కరీంనగర్:

ఇటీవల కాలంలో కరీంనగర్ లో నమోదవుతున్న భూదందాల కేసుల పరంపర ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. తరుచూ ఏదో కేసులో నిందితులు అరెస్ట్ అవుతున్న క్రమంలో అందరి నోళ్లలో ఈ అంశం నానుతూనే ఉంది. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుండి వ్యతిరికేతను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

ఛాలెంజ్ గా తీసుకున్నా…

కరీంనగర్ సీపీగా అభిషేక్ మహంతి బాధ్యతలు తీసుకున్న తరువాత ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బాధితులు నేరుగా సీపీని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో ఆధారాలు సేకరిస్తున్న పోలీసు అధికారులు ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. రాష్ట్రంలోనే అతి ఎక్కువ కేసులు కరీంనగర్ లోనే నమోదు కాగా… అందులో ఎక్కువ మంది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులో లేక వారి ముఖ్య అనచరులో అరెస్ట్ అయ్యారు. దీంతో గులాభి పార్టీ తీరుపై కరీంనగర్ అంతటా చర్చకు దారి తీసింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోకసభ ఎన్నికల్లో తన సత్తా చాటాలనకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సీరియస్ గానే పావులు కదుపుతున్నారు. రోడ్ షోలతో ప్రజల్లోకి వెల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కరీంనగర్ స్థానంపై అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించగా… ఇక్కడి నుండి పోటీ చేస్తున్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా తన గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో సమీకరణాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు సమీప గ్రామాల్లో వెలుగులోకి వచ్చిన భూ దందాల్లో గులాభి పార్టీ నాయకులే అరెస్ట్ అవుతుండడం… అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన తప్పిదాలు బయటపడుతుండడంతో ఇక్కడి ఓటర్లను ఆయన అనుకూలంగా మల్చుకునేందుకు స్పెషల్ ఆపరేషర్ చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది.

అలాంటి వారితోనే…

అయితే ఆయా కేసుల్లో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల భాగస్వామ్యం బయటపడుతున్న విషయాన్ని ఇక్కడి ప్రజలు సునిశితంగా గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముఖం మీదే చెప్పకున్నా అంతర్గతంగా మాత్రం ఆ పార్టీ నాయకులు చేసిన అరచకాలపై తీవ్రంగా చర్చ సాగుతోంది. అయితే భూదందాల్లో భాగస్వామ్యం ఉందన్న భయంతో ఉన్న కొంతమందికి ఓ నేత అండగా నిలుస్తున్న తీరు కూడా సాధారణ లీడర్లకు నచ్చడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వారికే ప్రాధాన్యం ఇచ్చి వారు చేసిన తప్పిదాలు  వెలుగులోకి వచ్చిన తరువాత కూడా సేఫ్ జోన్లకు వెల్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న తీరుపై సొంత పార్టీ నాయకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుని ముందు ఇన్ సైడ్ వ్యక్తపరిచే ప్రయత్నం చేయకున్నా సెకండ్ క్యాడర్ లీడర్లు మాత్రం మరింత మధనపడిపోతున్నారు. కేసుల పరంపరతో ఇప్పటికే పార్టీ అబాసుపాలైన విషయం తెలిసి కూడా వారికే అండగా నిలుస్తుండడం… పార్టీకి బలంగా ఉన్న వారిని నేటికీ పట్టించుకోకపోవడం పట్ల కొంతమంది స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు ఇతర నాయకులు కినుక వహిస్తున్నారు. అతి సన్నిహితంగా ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు కలుసుకుని ఈ అంశంపై చర్చించుకుంటున్నారు కూడా. తప్పులు చేసిన వారిని దండించే ప్రయత్నం చేయకపోవడం కూడా ప్రజల్లో చులకన భావానికి మరో కారణమన్న అబిప్రాయాన్నీ వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులు. ప్రత్యర్థి పార్టీలను మట్టికరిపించాలంటే ముందుగా ఆరోపణలున్న వారిని పార్టీ ప్రచారంలో దూరంగా పెట్టాలన్న ప్రతిపాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా లాభం లేదని గమ్మున ఊరుకుంటున్నారు బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ లీడర్లు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అరెస్ట్ అయిన నాయకులను దూరంగా పెట్టినట్టయితే పార్టీపై సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

బాధితుల ప్రచారం…

ఇకపోతే బాధితులు చేస్తున్న ప్రచారం కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. తమకు జరిగిన అన్యాయం గురించి ఇప్పటికే కరీంనగర్ అంతటా మారుమోగిపోయిన నేపథ్యంలో అరెస్టుల ఘటన వెలుగులోకి వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది చేసిన తప్పిదాలను ఎకరవు పెట్టే అవకాశం లేకపోలేదు. దీంతో మౌత్ టు మౌత్  పబ్లిసిటీ ద్వారా వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదని అంటున్న వారూ లేకపోలేదు.

వెంటాడుతున్న భయం…

ఇకపోతే కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరిని భయం వెంటాడడం కూడా ఇబ్బందికరంగా మారింది. తమపై పోలీసులకు ఫిర్యాదు వెల్లాయని, ఆధారాలు దొరికినట్టయితే అరెస్ట్ చేస్తారేమోనన్న భయం కూడా వ్యక్తం అవుతోంది. అలాంటి వారు కూడా ప్రజల్లోకి వెల్లి ఓట్లు అడిగేందుకు వెనుకంజ వేసే అవకాశాలే మెండుగా ఉంటాయి. వారిలో నెలకొన్న భయంతో మానిసక ధృడత్వానికి దూరమవుతారని దీంతో ప్రచారం చేసేప్పుడు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు అంతగా ఉండవన్నది వాస్తవం. ఈ క్రమంలో ఎవరైనా బాధితులు ఎధురపడినట్టయితే రచ్చరచ్చ అవుతుందన్న ఆందోళన కూడా వారిని వెంటాడే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో పోలీసులు అరెస్ట్ చేసినట్టయితే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవల్సి వస్తుంది కూడా. దీంతో ఇలాంటి నాయకులు కూడా ప్రచారంపై అంతగా దృష్టి సారించే అవకాశాలూ తక్కువే. 

You cannot copy content of this page