గూగుల్‌లో తగ్గనున్న ఉద్యోగులు

ఆర్థిక మాంద్యం భయం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాప్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తుండగా తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సైతం అదే దారిలో వెళ్తోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 వేల ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్టు శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు సదరు ఉద్యోగులకు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ సందేశంతో కూడిన ఈమెయిల్ పంపించారు. ఈ చర్య వల్ల అమెరికాలో సిబ్బందిపై ఎక్కువ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే ఉద్యోగులకు 60 రోజుల పూర్తి నోటిఫికేషన్ కాలానికి వేతనం చెల్లిస్తామని సుందర్ పిచాయ్ తన ఈమెయిల్ సందేశంలో వెల్లడించారు. పరిహార ప్యాకేజీ కింద 16 వారాల వేతనంతో పాటు గూగుల్ లో పని చేసిన కాలానికి గాను ఏడాదికి రెండు వారాల చొప్పున వేతనం చెల్లిస్తామని తెలిపారు. గూగుల్ తీసుకున్న తాజా నిర్ణయంతో రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యాకలాపాలు, ఇంజనీరింగ్, ప్రొడక్ట్స్ టీమ్ కు చెందిన విభాగాల ఉద్యోగాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

You cannot copy content of this page