లక్ష్మీని వెంటాడుతున్న దరిద్రం..! మేడిగడ్డలో మళ్లీ భారీ శబ్దాలు..?

దిశ దశ, భూపాలపల్లి:

సమస్యను సరిదిద్దాలంటే లోపం ఏంటీ అన్నది తేలాలి. ఆ లోపం తెలిస్తేనే దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే అసలు ఇబ్బంది ఏంటో తెలుసుకునేందుకే మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితి తయారు కావడమే తలనొప్పిగా మారిందక్కడ. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలిమెట్టు అయిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు ఇంజనీర్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టుగా స్పష్టం అవుతోంది. బ్యారేజీ వద్ద ఏం జరుగుతుందోనన్న విషయాన్ని బయటకు పొక్కుకుండా, ప్రైవేటు వ్యక్తులకు అక్కడకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండడంతో మేడిగడ్డ అసలేం జరుగుతోందన్నదే హాట్ టాపిక్ గా మారింది.

మళ్లీ భారీ శబ్దం…

మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులోని పిల్లర్లు కుంగిపోయిన సంగతి తెలిసిందే. ఏడో పిల్లర్లకు సంబంధించిన గేట్లను తొలగించి దిగువ ప్రాంతానికి నీటిని యథావిధిగా వదిలాలని, లేనట్టయితే బ్యారేజీకి ప్రమాదమని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో వీటి గేట్లను తొలగించేందుకు ఇరిగేషన్ ఇంజనీర్లు, ఎల్ అండ్ టి టీమ్ రంగంలోకి దిగింది. 16వ గేట్ ఎత్తుతుండగా భారీ శబ్దంతో కూడిన కుదుపు చోటు చేసుకుంది. దీంతో ఏడో బ్లాకులోని గేట్లు ఎత్తే ప్రక్రియకు తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా సమాచారం. ఇంజనీర్లు బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్లు భారీ శబ్దాలు, ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అప్రమత్తం చేయడంతో తమ ప్రయత్నాలను నిలిపివేశారు. భారీ సైజులో ఉన్న గేట్లను ఎత్తుతున్న క్రమంలో బ్యారేజీ పునాదిపై ఒత్తిడి పెరిగడం వల్ల పిల్లర్లు మరింత కూరుకపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

భారీ సైజులో గొయ్యి…

ప్రధానంగా బ్యారేజీకి దిగువన నీటి అడుగులో గతంలో వచ్చిన వరదల కాలరణంగా పెద్ద ఎత్తున ఇసుక కొట్టుకపోయినట్టుగా తెలుస్తోంది. మరో వైపున బ్యారేజీ బ్యాక్ వాటర్ ఏరియాలో 12 నుండి 15 మీటర్ల సైజులో ఈ గుంత ఏర్పడిందని గుర్తించిన అధికారులు గ్రౌంటింగ్ పనుల ద్వారా గోతిని పూడ్చాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఏడో బ్లాకులో పిల్లర్లు కుంగుబాటుకు గురైన తరువాత సుమారు 40 వేల ఇసుక బస్తాలను వేయగా తాజాగా మరోచోట గొయ్యిని గుర్తించడం గమనార్హం. మరోవైపున పిల్లర్ల దిగువ భాగంలో ఉన్న నీటిని 40 హెచ్ పి మోటార్ల సాయంతో  ఎత్తిపోస్తున్న అధికారులు, ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరదను కట్టడి చేసేందుకు వేర్వేరు ప్రాంతాల్లో రెండు డైవర్షన్ బండ్లను కూడా నిర్మించారు. అయితే వరధ ఉధృతి అనుకున్నంత మేర తగ్గడం లేదని విశ్వసనీయంగా తెలిస్తోంది. ప్రధానంగా పిల్లర్లు కుంగిపోవడానికి అసలు కారణం ఏంటీ..? నీటి అడుగున జరిగిన నిర్మాణాలకు సంబంధించిన లోపాలు ఏమైనా ఉన్నాయా..? వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవల్సి ఉంటుంది..? తదితర అంశాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే ఇంజనీర్లు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించకపోవడంతో బ్యారేజీ డ్యామేజీ కాకుండా చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఎన్డీఎస్ఏ నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా బ్యారేజ్ గేట్లన్నింటిని ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదిలేయాలని, ఏడో బ్లాకు గేట్లను ఖచ్చితంగా ఎత్తాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాటిని ఎత్తేందుకు తీసుకుంటున్న నేపథ్యంలో తొలి అడుగులోనే ఇబ్బందులు ఎదురయ్యాయి.

You cannot copy content of this page